ఆ వివ‌క్ష చంద్ర‌బాబుకు ఇప్పుడే తెలిసిందా!

పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజ‌క వ‌ర్గ ఇన్ఛార్జ్ ల‌కు అమ‌రావ‌తిలో ఒక వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 2019 ఎన్నిక‌ల ల‌క్ష్యాల‌ను నిర్దేశించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కాబోతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మంలో అభివృద్ధి ప‌థ‌కాల గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌న్నారు. అర్హులై ఉండీ, ఇంత‌వ‌ర‌కూ సంక్షేమ ప‌థ‌కాలు అందుకోనివారిని గుర్తించాల‌నీ వెంట‌నే అలాంటివారికి లబ్ధి అందేలా చూడాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ఎక్క‌డా ఎలాంటి వివ‌క్షా చూపించొద్ద‌నీ, నంద్యాల‌లో కూడా అర్హులైన వారంద‌రికీ ఎలాంటి వివ‌క్షా లేకుండా సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల‌ను అందించామ‌నీ, అందుకే అక్క‌డి ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని చంద్ర‌బాబు అన్నారు. పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అందాల‌న్నారు. ఆ ప‌థ‌కాలను ఇస్తున్న‌ది మ‌న‌మే కాబ‌ట్టి, వాటి గురించి ప్ర‌చారం చేయాల‌ని చంద్రబాబు చెప్పారు.

అంటే, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో ఇన్నాళ్లూ కొంత వివ‌క్ష చూపించార‌ని ఒప్పుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవ‌చ్చు క‌దా! నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తే త‌ప్ప‌.. ఆ జ్ఞానోద‌యం క‌ల‌గ‌లేదా అనేదే ప్ర‌శ్న‌..? నిజానికి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లూ ల‌బ్ధిదారుల ఎంపిక వంటి విషయాల్లో జ‌న్మ‌భూమి క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చేవి. అయితే, వాటి ప‌నితీరు స‌రిగా ఉండ‌టం లేద‌నీ, కొంత‌మంది త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారికే ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఫ‌లాల‌ను అందేలా చేస్తున్నార‌నీ, అర్హుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ర‌ద్దు చేసి, కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల‌ని గ‌త నెల‌లో సీఎం చెప్పారు. ఆ త‌రువాత‌, నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌లు రావ‌డంతో దాని గురించి ప‌ట్టించుకోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే… గ‌డ‌చిన మూడున్న‌రేళ్లూ ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటున్న సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అంద‌లేద‌న్న‌మాట‌! కొంత వివ‌క్ష చూపించ‌డం వాస్త‌వ‌మే అన్న‌మాట‌.

నిజానికి, అధికారంలో ఉన్న‌పార్టీ ఏదైనాస‌రే.. ఎన్నిక‌లు ముగియ‌గానే రాజ‌కీయాలు మానుకోవాలి. ఒక‌సారి ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత‌, ప్ర‌జ‌లంద‌ర్నీ స‌మానంగా చూడాలి. మ‌న పార్టీకి ఓటెయ్య‌నివారికి సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు ఇవ్వ‌కూడ‌ద‌నే వివ‌క్ష ఉండ‌కూడ‌దు. ‘నంద్యాలలో వివ‌క్ష చూప‌కుండా అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇచ్చాం. అదే మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అనుస‌రించాలి’ అని ఇప్పుడు ముఖ్య‌మంత్రి చెబుతూ ఉండ‌టం విడ్డూరంగా ఉంది. అంటే, నంద్యాల ఉప ఎన్నిక‌లు వ‌స్తే త‌ప్ప‌… ఈ స్థాయిలో విప‌క్ష ఉంద‌నే సంగ‌తి ముఖ్య‌మంత్రికి అర్థం కాలేదా..? ఒక‌వేళ నంద్యాల ఉప ఎన్నిక రాక‌పోయి ఉంటే, ఆ సంగ‌తి ముఖ్య‌మంత్రికి కూడా తెలీదేమో! ఏదేతైనేం, గ‌డ‌చిన మూడున్న‌రేళ్ల‌లో కొంత వివ‌క్ష చూపించాం అని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టేగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.