ప్రొ.నాగేశ్వర్ : కేసీఆర్, చంద్రబాబు ఒకే వ్యూహం..! మరి ఫలితం..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు… ఒకే వ్యూహాన్ని గట్టిగా అమలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అమలు చేసిన వ్యూహమే… చంద్రబాబు కూడా అమలు చేస్తున్నారు. తెలంగాణపై మళ్లీ ఆంధ్రుల పెత్తనం మనకు అవసరమా అంటూ కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు… చంద్రబాబు.. ఆంధ్రపై కేసీఆర్ పెత్తనం అవసరమా అంటూ స్పందిస్తున్నారు. ఇద్దరి వ్యూహాలు ఒకే లాగ ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ప్రతిపక్షం..!

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. రెండు రాష్ట్రాలు.. ఒకేలా ఉండే సంక్షేమ పథకాలను పోటీ పడి అమలు చేస్తున్నాయి. ఇటీవల వరకు.. ఉమ్మడి రాష్ట్రం. అందుకే ప్రజల అభిప్రాయాలు.. ఇతర అంశాల్లో సారూప్యత ఉంటుంది. అలాగే.. కేసీఆర్.. టీడీపీలో చాలా కాలం పని చేశారు. చంద్రబాబు నాయకత్వంలో.. కేసీఆర్.. కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం పార్టీలోనూ ఆయనకు మంచి వ్యూహకర్త అనే పేరు ఉంది. టీడీపీ హెచ్చార్డీ విభాగాన్ని ఆయన చూసుకునేవారు. అలా కలసి పని చేయడం వల్ల ఒకరి వ్యూహాలపై ఒకరికి అవగాహన ఉండొచ్చు. అయితే… తెలంగాణలో కేసీఆర్‌కు ఉన్నంత సానుకూలత ఏపీలో చంద్రబాబుకు ఉంటుందా అంటే … చెప్పలేం. ఎందుకంటే.,. తెలంగాణలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎదురులేదు. కానీ ఏపీలో ఓ బలమైన ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే.. పథకాల ప్రభావం వేరుగా ఉంటుంది. ఎన్నికల కోసమే చంద్రబాబు… కొత్తగా పథకాలు తెచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. తెలంగాణలోనూ ప్రతిపక్షం ఆ పని చేసింది. కానీ పెద్దగా విజయవంతం కాలేదు.

కేసీఆర్‌కు.. చంద్రబాబుకన్నా ఎక్కువ సానుకూలతలున్నాయి..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పొలరైజేషన్… జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య, రెండు కులాల మధ్య పొలరైజేషన్ జరుగుతోంది. అయితే.. చంద్రబాబు లేకపోతే.. జగన్ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో అది లేదు. తెలంగాణలో కులాలకు అతీతంగా ప్రజలు ఓట్లేశారు. ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కులాల ప్రకారం ఓట్లు చీలిపోతున్నాయి. అలాగే.. కేసీఆర్ .. ప్రజల్లోకి వెళ్లేలా మాట్లాడుతారు. రెండు రాష్ట్రాల్లోనూ గొప్ప కమ్యూనికేటర్. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడటంలో.. కేసీఆర్ దిట్ట. తెలంగాణ ఉద్యమ సమయంలో… కూడా.. తన ప్రసంగాల ద్వారానే ఎక్కువ అడ్వాంటేజ్ సాధించారు. ఒకే పథకాలు ప్రవేశ పెట్టినా.. ఒకే విధమైన విధానాల్ని అవలంభించినా కూడా.. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులే.. ఎన్నికల ఫలితాలను నిర్ధారిస్తాయి.

తెలంగాణ ప్రజలకు పౌరుషం..! మరి ఆంధ్ర ప్రజలకు..?

తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ బాగా రగిలించారు. చంద్రబాబు… తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని.. తెలంగాణ ప్రజలకు పౌరుషం లేదా.. అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా… ఏపీపైకి.. కేసీఆర్ పెత్తనానికి వస్తున్నారని… ఏపీ ప్రజలకు పౌరుషం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర సెంటిమెంట్ రగిలిస్తున్నారు. అయితే.. తెలంగాణకు ఓ హిస్టరీ ఉంది. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారు. చంద్రబాబుపై తెలంగాణ వ్యతిరేకుడిగా… ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. అయితే.. ఏపీలో కేసీఆర్ పై వ్యతిరేకత ఉంటుందా.. లేదా.. అన్నది చెప్పలేం. ఎందుకంటే.. కేసీఆర్ నేరుగా.. ఏపీకి వెళ్లి ప్రచారం చేయడం లేదు. అలా చేస్తే సెంటిమెంట్ పెరిగేది.కానీ కేసీఆర్ వెళ్లడం లేదు. ఈ భావోద్వేగ అంశాల కన్నా… ఏపీకి ఏది మంచో..చెడో… దానిపై స్పందిస్తే… బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.