పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రవర్తించిన తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఎమ్మెల్యే చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేను పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని, ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇటువంటి ఘటనలు పక్కదారి పట్టిస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై చంద్రబాబు కేవలం పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాకుండా, బహిరంగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనూ పరోక్షంగా స్పందించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. కొంతమంది ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారు.. పోలీసు ఆఫీసులపై పడి ధర్నాలు చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అరాచక పాలనను అంతం చేసి మనకు అవకాశం ఇచ్చారని, మనం కూడా అలాగే ప్రవర్తిస్తే గత ప్రభుత్వానికి, మనకు తేడా ఏముంటుందని నిలదీశారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేల మానసిక స్థితిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నిరంతరం ఒత్తిడికి గురవుతున్నారని, ఆ ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. టెన్షన్ ఎక్కువగా ఉంటే మెడిటేషన్ చేయండి.. అంతేకానీ అధికారులపై ప్రతాపం చూపవద్దు అని సూచించారు. క్రైమ్ సీరియల్స్, సినిమాల ప్రభావంతో ఉద్రేకాలకు లోనై చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని, ప్రశాంతమైన చిత్తంతో ప్రజలకు సేవ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ఎస్పీ ఆఫీసులో గదిలో బంధించుకుని చేసిన నిరసనను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. ఒక లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ కోసం అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని, ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులతో లేదా పార్టీ పెద్దలతో చర్చించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు గట్టి సంకేతాలు పంపారు. అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.


