తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది మరి.
మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న సీఎంలు
ఇది అధికారిక కార్యక్రమం కాదు. రామోజీ గ్రూపు.. తమ వ్యవస్థాపకుడు రామోజీరావు పేరు మీద ఎక్సలెన్సీ అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సమాజం కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. అధికారిక హోదాలో సీఎంలు హాజరైనప్పటికీ.. ప్రైవేటు కార్యక్రమం కాబట్టి రాజకీయాలు మాట్లాడలేదు. రామోజీ గురించే మాట్లాడారు. వ్యక్తిగతంగా మాత్రం చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో కానీ చంద్రబాబు, రేవంత్ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు.
రాజకీయాలు మాట్లాడుకున్నారా ?
చంద్రబాబు, రేవంత్ నవ్వుకుంటూ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే వారు రాజకీయాలు మాట్లాడుకున్నారన్నదానిపై క్లారిటీ లేదు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక విజయంతో రేవంత్ హుషారుగా ఉన్నారు. అయితే ఆ టాపిక్ చంద్రబాబుతో చర్చించలేరు. ఎందుకంటే ఆయన ఎలా చూసినా ఎన్డీఏ పక్ష నేత.కేవలం వ్యక్తిగత అంశాలు, ఇతర జ్ఞాపకాలపై చర్చించుకుని నవ్వుకుని ఉంటారని భావిస్తున్నారు. పైగా రాజకీయ అంశాలపై అలా బహిరంగంగా చర్చించుకుని నవ్వుకునేలా వారి వ్యవహారశైలి ఉండదని చాలా మంది గుర్తు చేస్తున్నారు. కొంత మంది అది జూబ్లిహిల్స్ విజయం గురించేనని విశ్లేషిస్తున్నారు కానీ.. టాపిక్ రాజకీయేతరమని అనుకోవచ్చు.
టీడీపీ సపోర్టర్లను తన వైపే ఉంచుకుంటున్న రేవంత్
చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉంచారు. సహచరులమని రేవంత్ అంటారు. కేసీఆరే.. చంద్రబాబు శిష్యుడని కౌంటర్ వేస్తూంటారు. రేవంత్ టీడీపీలో ఎదిగి.. కీలక సమయంలో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి దూరమయ్యారు. కానీ ఆయన ఎప్పుడూ టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ ఆయనకు బాగా తెలుసు. టీడీపీ సపోర్టర్ల మద్దతును ఎలా కాపాడుకోవాలో ఇంకా బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడరు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రేవంత్ మరింతగా టీడీపీ అభిమానులు తనను దాటి పోకుండా చూసుకుంటున్నారు.
