రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతలకు చెబుతూ ఉంటారు. ఈ దిశగా అన్ని జిల్లాల్లోనూ నేతలు సమష్టిగా ముందుకు సాగుతూ ఉంటే, కడప జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెబుతున్నా కడప జిల్లా నేతల తీరు మారడం లేదని తెలుస్తోంది. దీంతో ఆ జిల్లా నేతలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
నిజానికి, కడప జిల్లా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. వైయస్ సొంత జిల్లా కావడంతో వారిదే హవా కొనసాగేది. ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. వైయస్ కుమారుడు జగన్ సొంత జిల్లాలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారని తెలుగుదేశం విశ్లేషణ. అందుకే, ఈ పరిస్థితులను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలని ఎంత వాపోతున్నా… స్థానిక నాయకులు సీరియస్గా తీసుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డున్నట్టు సమాచారం. అందువల్లేనే ఎప్పటికప్పుడు కడప తెలుగుదేశం నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారని చెబుతున్నారు.
ఈ మధ్య కడప పర్యటన సందర్భంగా పార్టీ నేతలతో చంద్రబాబు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నేతల తీరుపై చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట! తాను ఒకటి చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మరొకటి జరుగుతోందనీ, అందుకే జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకోలేకపోతోందని చిర్రుబుర్రులాడారు. పార్టీ నాయకులు కేవలం పట్టణ ప్రాంతాలకు పరిమితమౌతుంటే పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుందని మండిపడ్డారట. లేదంటే, రాజధాని అమరావతికి వచ్చి, తన వెంట తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారనీ, ప్రజల్లో కలిసి తిరిగే తప్ప పార్టీ బాగుపడదని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు.
అయితే, ఇలా క్లాసులు పీకించుకోవడం కడప జిల్లా తెలుగుదేశం నేతలకు ఇదేమీ తొలిసారి కాదు. ఇలాంటి వార్నింగులు చాలా అయిపోయాయి. వ్యక్తిత్వ వికాస పాఠాలు చాలా విన్నారు. అయినాసరే, పార్టీ నేతల పరిస్థితిపై ఏమాత్రం మార్పు రాపోవడంతో చంద్రబాబు కాస్త అసహనంతో ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. మరి, కడప తమ్ముళ్లు చంద్రబాబు మనోగతం అర్థం చేసుకునే ఎప్పుడు వస్తుందో..!