ఏపీ ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనుంది. ఈ నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు అనంతపురం సభలో ప్రకటించారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టినప్పుడు మంత్రులు ఆటోడ్రైవర్లకు ఏదో ఓ సాయం చేయాలని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వారికీ ఆర్థిక సాయం అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నారు. గతంలో వాహన మిత్ర పేరుతో వైసీపీ సర్కార్ పదివేలు ఇచ్చింది. కానీ వాటిని వివిధ రూపాల్లో మళ్లీ వసూలు చేసింది. రకరకాల ట్యాక్సులు ఆటోలపై వేసింది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు రూ. పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి పథకం ప్రకటిస్తారని ఎవరూ అనుకోలేదు. దాంతో ఒక్క సారిగా ఆటోడ్రైవర్లలో ఈ పథకం హాట్ టాపిక్ అయింది. వచ్చే నెలలోనే దసరా ఉంది. ఆ రోజున జమ చేస్తే ఆటో డ్రైవర్ల ఆనందానికి హద్దులు ఉండవు. నిజానికి ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్ల మీద పడే ఎఫెక్ట్ చాలా చిన్నది. బస్సు సౌకర్యాలు లేని చోటనే ఎక్కువగా ఆటోలు తిరుగుతూ ఉంటాయి.
పల్లె వెలుగు బస్సుల్లో ఉచితం కాబట్టి.. మహిళా ప్రయాణికులు తగ్గిపోయారు. ఆటో డ్రైవర్లకు ఇది ఒక్కటే సమస్య. అందుకే వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. పదిహేను వేలు ఆటోడ్రైవర్ల ఖాతాల్లో వేస్తే.. వారు కూడా సంతోషపడతారు. కూటమి ప్రభుత్వం గత వైసీపీలా .. మొదటి లబ్దిదారుగా సాక్షి పత్రికను చేర్చి.. ప్రకటనలు ఇచ్చి.. ఆ తర్వాత బటన్లు నొక్కడం లేదు. పద్దతిగా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు.