తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న కార్యకర్తలను చంద్రబాబు పేరుతో సహా గుర్తు పెట్టి పలకరించగలరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను మొత్తం చంద్రబాబు చూసేవారు. అప్పట్లో పరిచయం అయిన వారు.. పార్టీ నేతల్ని ఆయన ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.అలాంటి వారిలో ఎవరికైనా సమస్య వచ్చిందని తెలిస్తే వెంటనే స్పందిస్తారు.
తాజాగా రాజమండ్రికి చెందిన ఆకుల కృష్ణ అనే కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్ చేశారు. మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ టీడీపీ అభిమాని. టీడీపీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటారు. ఆకుల కృష్ణ చంద్రబాబును ఒక్కసారైనా చూడాలని లేదా మాట్లాడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే, చంద్రబాబు స్వయంగా వీడియో కాల్ ద్వారా కృష్ణతో మాట్లాడారు. కృష్ణ ఆరోగ్యం గురించి ఆరా తీసి, అతనికి ధైర్యం చెప్పారు.
మంచి వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యకర్తకు చంద్రబాబు ఫోన్ కాల్ వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు కార్యకర్తల పట్ల చూపే ఆప్యాయతకు నిదర్శనంగా ప్రశంసలు వస్తున్నాయి. టీడీపీని కార్యకర్తల పార్టీ అంటారు. టీడీపీపై .. నాయకత్వం పై కోపం వస్తే కార్యకర్తలు ఇంట్లో పడుకుంటారు కానీ వేరే పార్టీకి పని చేయరని.. అంతటి కార్యకర్తల బలం టీడీపీకి ఉందని చెబుతూంటారు. అలాంటి కార్యకర్తల కష్టాలను తీర్చేందుకు టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వారి సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతోంది.