జగన్ రెడ్డి ఇన్ని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నామని ఓ మంత్రి నేరుగా చంద్రబాబును కేబినెట్ సమావేశంలో అడిగేశారు. దీంతో ఇతర మంత్రులు అవాక్కయ్యారు. కానీ చంద్రబాబు శాంతంగా తనదైన పద్దతిలోనే సమాధానం చెప్పారు. నన్ను జైలులో పెట్టాడని జగన్ను జైలులో పెడితే ఎలా కుదురుతుంది.. అది కరెక్ట్ కాదు కదా? అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుాగ తెలుస్తోంది. జగన్ తప్పులకు సాక్ష్యాలు ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని కానీ ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నేరం చేసి మళ్లీ మన మీద నిందలు వేస్తున్నారన్నారని అందుకే మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మంత్రి వర్గ సమావేశంలో అజెండా అంశాలపై నిర్ణయాలు అయిపోయిన తరవాత మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పట్లాగే పలు సూచనలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి రౌడీషీటర్ల పరామర్శకు వెళ్లడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కొంత మంది మంత్రులు చెప్పారు. ఈ సమయంలో నేరస్వభావ రాజకీయ నేతల తీరు ఎలా ఉంటుందో చంద్రబాబు వివరించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ రెడ్డిపై అక్రమ కేసులు పెడతారని వైసీపీ నేతలు అంటున్నారు. అన్ని సాక్ష్యాలతో కేసులు పెట్టాలని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఆ విషయం మరోసారి స్పష్టమయింది.