ఫిరాయింపుల పుణ్యమా అని ఆంధ్రాతో తెలుగుదేశం పార్టీ మరింత బలపడినట్టు ప్రస్తుతానికి కనిపిస్తోంది. అయితే, అదే ఫిరాయింపులు తెలంగాణలో తెలుగుదేశం కొంప ముంచాయి. ప్రస్తుతం ఆ పార్టీలో బలమైన నాయకులు ఎవ్వరూ లేరు. స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారంటే.. అది రేవంత్‌రెడ్డి ఒక్కరు మాత్రమే! రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం ఊపు తగ్గిపోయిందనే చెప్పాలి. ఫిరాయింపు దెబ్బకు పునాదులు కదిలిపోయిన పరిస్థితి. నిజానికి, తెలంగాణలో పార్టీ బాధ్యతల్ని నారా లోకేష్‌కు అప్పగించారు. అయితే, కొన్నాళ్లపాటు టి. పార్టీలో క్రియాశీలంగా ఉన్నా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్‌ను ఆంధ్రాకే పరిమితం చేశారు చంద్రబాబు! తెలంగాణ నేతలు స్వతంత్రంగా వ్యవహరించాలని పిలుపునిచ్చి ఊరుకున్నారు. దీంతో టి. శ్రేణుల్లో కూడా కాస్త నిరుత్సాహం నెలకొందనే చెప్పాలి.
అయితే, కొంత గ్యాప్ తరువాత తెలంగాణపై కూడా శ్రద్ధ పెట్టేందుకు సిద్ధమౌతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు మొదట్నుంచీ ఉన్నాయని తాజాగా అభిప్రాయపడ్డారు. టి. నేతలపై తనపై చూపుతున్న ఆదరణ చూస్తే ఇక్కడే ఉండిపోవాలని ఉందని చంద్రబాబు అన్నారు! ఆంధ్రాలో తనకున్న బాధ్యతల దృష్ట్యా వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. బలమైన నాయకత్వాన్ని ఇస్తే అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు అని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారని వివరించారు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం నేతలు గ్రామస్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేతలు పార్టీ చేస్తున్న కృషికి సంబంధించి తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నా అన్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ లాంటి నాయకుడు అవసరం ఉందని చంద్రబాబు చెప్పినట్టే కదా! అయితే, ఆ మోడీ ఎవరు..? ఏ నాయకుడిలో తాను కోరుకుంటున్న మోడీని చూడాలని చంద్రబాబు అనుకుంటున్నారు..? మొత్తానికి నరేంద్ర మోడీ స్ఫూర్తి టి.దేశం నేతల్లోకి ఎక్కించేందుకు చంద్రబాబు బాగానే ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. మరి, ఇదే మోటివేషన్ ఫార్ములాను ఆంధ్రాలో కొంతమంది మంత్రులపై కూడా అప్లై చేస్తే బాగుంటుంది. కొంతమంది పనితీరుపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి కదా!