కోపతాపాలు ఎవరిపైన?

రేవంత్‌ రెడ్డి ఉదంతం అలా సాగుతూ వుంటే టిడిపి నాయకత్వం రకరకాల విన్యాసాలు చేస్తున్నది.ఈ మూడురోజులలో టిటిడిపి నేతలు మూడోసారి సమావేశమైనారు. ప్రతిసారీ చంద్రబాబు నుంచి ఫోన్‌ వచ్చిందనీ, క్రమ శిక్షణ పాటించని వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే ఆఖరుకు వచ్చే సరికి చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాకే ఒక స్పష్టత వస్తుందని ముక్తాయిస్తున్నారు. స్పష్టత దేనిపైన? క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చంద్రబాబు ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?రేవంత్‌ గురించి ఆయన ఏమన్నారు?ఈ నాయకులు గాని ఆయన గాని చెప్పడం లేదు. నిజానికి తల్చుకుంటే విదేశాల నుంచి కూడా స్పందించడం పెద్ద సమస్య కాదు. కావాలనే ఈ అంశాన్ని నానబెడుతున్నారనేది స్పష్టం. కాంగ్రెస్‌లో చేరడం లేదని రేవంత్‌ స్పష్టంగా ముందే చెప్పకపోయినా చంద్రబాబు కలిస్తే అప్పుడు దాన్ని ఆయన తనకు అనుకూలంగా వాడుకోవడం తథ్యం. ముందే చెప్పేస్తే కలిసే అవకాశమే వుండదు. పైగా త్వరలో శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. విషయం తేలకుండానే టిడిఎల్‌పి నేతగా రేవంత్‌ సభలకు హాజరయ్యేట్టయితే పార్టీకి ఆయనకూ కూడా గౌరవంగా వుండదు. అధినేతకు పంపిన నివేదికలో తాము క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరినట్టు టిటిడిపి ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ తతంగం ముందే అవుతుందా అంటే వచ్చాకే తేలుతుందంటున్నారు. అంటే రేవంత్‌ సమాధానం ఇవ్వకపోయినా ఆయనకు సమయం ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా వుందన్నమాట. ఇది బలహీనతను సూచించే సంకేతమే. రేవంత్‌కు చంద్రబాబు మరీ ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారని పయ్యావుల కేశవ్‌ బహిరంగంగానే విమర్శించారు. ఇక రేవంత్‌ కూడా ఇంత తతంగం తర్వాత తలవంచుకుని మళ్లీ టిటిడిపి నేతగా వెళ్లేట్టయితే ఇప్పటి వరకూ జరిగింది అర్థరహితమవుంది. టిడిపిలో కొనసాగినా విశ్వసనీయత గతంలోని విలువ వుండవు. మరి ఆయన ఈ సమయాన్ని కాంగ్రెస్‌తో బేరసారాలకు వాడుకుంటుండవచ్చు. ఏమైనా ఎడతెగని ఈ ప్రహసనం ప్రజలకు విసుగే గాక జుగుప్స కూడా కలిగిస్తున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.