ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిలోనే విశ్రాంతి వెదుక్కుంటున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లి నాలుగు రోజుల పాటు అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో తీరిక లేని సమావేశాలు నిర్వహించారు. పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆయన, కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా నేరుగా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
దావోస్ నుండి రాగానే ఆయన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి అధ్యక్షత వహించారు. విదేశీ పర్యటనలో రాష్ట్ర బ్రాండింగ్ , పెట్టుబడులపై దృష్టి పెట్టిన ఆయన, స్వదేశానికి రాగానే క్షేత్రస్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండటం, వడ్డీల భారం పెరగడం వంటి అంశాలపై బ్యాంకర్లతో సుదీర్ఘంగా చర్చించారు. రూ. 49 వేల కోట్ల మేర రుణాలను రీ-షెడ్యూల్ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికాభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలని, వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యూయర్” విధానాన్ని విజయవంతం చేయాలని కోరారు. దావోస్లో పెట్టుబడుల వేట, అమరావతిలో ఆర్థిక క్రమశిక్షణపై బ్యాంకర్లతో సమావేశం.. ఇలా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న వేగం రాష్ట్ర పునర్నిర్మాణంపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని బ్యాంకర్లు కూడా ప్రశంసించారు.