ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం శాఖా పరమైన వ్యవహారాలకే పరిమితం కాకుండా, పార్టీ పనులు కూడా సీరియస్ గా చేయడంలేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు.
12 మంది మంత్రులపై వ్యతిరేక నివేదికలు
కేబినెట్లో 10 నుండి 12 మంది మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు ప్రతికూల నివేదికలు అందినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. గత ఆరు నెలల పనితీరును విశ్లేషించిన సర్వేలు ,ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్ని సార్లు హెచ్చరించినా దారికి రాని మంత్రులు
ఎన్నిసార్లు హెచ్చరించినా మంత్రులు దారికి రావడం లేదు. ఏడాదిన్న తర్వాత చంద్రబాబు అనేక హెచ్చరికల తర్వాత కడా వారు ఇతర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు కానీ తమ కర్తవ్యాలపై ఆలోచన చేయడంలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు
పనితీరు మార్చుకోని మంత్రులకు భవిష్యత్తులో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు పంపుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, ప్రజల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా, జిల్లాల్లో పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు.
యువ ఎమ్మెల్యేలకు మరిన్ని అవకాశాలు
చంద్రబాబు వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు మరింత యువ టీంను రెడీ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఎమ్మెల్యేలు అయినా రాజకీయంగా దూకుడుగా ఉండే వారిని టీంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.రెండేళ్ల తర్వాత లేదా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పూర్తయిన తర్వాత సమీకరణాలను బట్టి చంద్రబాబు కూడా మంత్రి వర్గాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి.
