హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో తమ పాత్రను గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ప్రపంచ గతిని మార్చబోతున్న అత్యాధునిక సాంకేతికతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఎస్బీ వేదికగా కీలక ఉపన్యాసం చేశారు. అభివృద్ధి ఒక్కటే ఎప్పుడూ ఎన్నికల్లో గెలిపించకపోవచ్చు కానీ, సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి టెక్నాలజీ ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఐఎస్బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి తాము పడ్డ కష్టాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తు తరాలు ఉద్యోగాల కోసం వెతికేవారు కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయి కి ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత యుగం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటం కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీలదని చంద్రబాబు విశ్లేషించారు. యుద్ధరంగం నుంచి వ్యవసాయం వరకు డ్రోన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, దీనిని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం టెక్నాలజీని వాడటమే కాకుండా, డేటా భద్రత , సరైన పాలసీల రూపకల్పన ద్వారా ఏపీని ఒక నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని చెప్పారు. గతంలో బిల్ గేట్స్ వంటి వారిని ఒప్పించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ తెచ్చిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిపారు.
తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సదస్సులో ప్రత్యేకంగా నిలిచాయి. హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి నిర్మించినా 2004లో ఎదురైన ఫలితం తనకు పెద్ద పాఠమని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం భవిష్యత్తు కోసం చేసే అభివృద్ధి మాత్రమే కాకుండా, ప్రజల తక్షణ అవసరాలు, సెంటిమెంట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అందుకే ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమం’ రెండింటినీ సమతూకంలో ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.
