ప్ర‌ధాని ముందు ఏపీ స‌మ‌స్య‌లు లేవ‌నెత్తిన సీఎం

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో జ‌రిగిన నీతీ ఆయోగ్ స‌మావేశంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని సీఎం చంద్ర‌బాబు మరోసారి ప్ర‌స్థావించారు. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రులంద‌రికీ 7 నిమిషాలు చొప్పున మాత్ర‌మే మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, విభ‌జ‌న ఎదుర్కొన్న ఏపీని ప్ర‌త్యేక రాష్ట్రంగా చూడాల‌నీ, స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌నీ, కాబ‌ట్టి త‌న ప్ర‌సంగాన్ని ప్ర‌త్యేకంగా పరిగణించాలంటూ దాదాపు 20 నిమిషాల‌కుపైగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాలంటూ డిమాండ్ చేశారు. దీంతోపాటు విశాఖ రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ వంటివి వెంట‌నే ప్ర‌క‌టించాల‌న్నారు.

ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు సాకుగా చూపి ఇవ్వ‌లేద‌నీ, ఏపీకి హోదా ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రాన్ని కూడా ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఏపీలో విద్యా సంస్థ‌ల‌కు కూడా నిధులు అర‌కొరగా విడుద‌ల చేశార‌నీ, దీంతో నిర్మాణాలు పూర్తి కాలేద‌ని చెప్పారు. ఆంధ్రా ప్ర‌జ‌లు విభ‌జ‌న‌ను కోరుకోలేద‌నీ, కానీ విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత న‌ష్ట‌పోయిన ఆంధ్రాను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని భాజ‌పా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ప్ర‌క‌టించింద‌న్నారు. పార్ల‌మెంటులో ఇచ్చిన హామీల‌ను కేంద్రం అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విభ‌జిత రాష్ట్రానికి రాజ‌ధాని కూడా లేద‌నీ, దీంతోపాటు పోల‌వ‌రం ప్రాజెక్టుకి కూడా నిధులు మంజూరు చేయాల్సి ఉంద‌ని కోరారు. రెవెన్యూ లోటు భ‌ర్తీతోపాటు, వెనుక‌బ‌డిన ఏడు జిల్లాల‌కు చేస్తామ‌న్న ఆర్థిక సాయాన్ని కూడా విడుద‌ల చేయాల్సి ఉంద‌న్నారు.

నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌స్థావిస్తూ… ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. ఇప్ప‌టికీ న‌గ‌దు ల‌భ్య‌త దేశ‌వ్యాప్తంగా స‌మ‌స్య‌గానే ఉంద‌నీ, దీంతో చిన్న వ్యాపారులు, రైతులు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు మాట్లాడుతుంటే ముగించాలంటూ రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయినాస‌రే మొత్తం 35 పాయింట్ల‌ను ప్ర‌ధాని ముందు చంద్ర‌బాబు వివ‌రించారు. నిజానికి, పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో కూడా ఏపీ స‌మ‌స్య‌ల గురించి వినేందుకు ప్ర‌ధాని అందుబాటులో లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, నేరుగా ఏపీ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న విన్న సంద‌ర్భం ఇదే.

చంద్ర‌బాబు ప్ర‌సంగంపై కేంద్రం స్పంద‌న అనూహ్యంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే, ఏపీ స‌మ‌స్య‌లు వారికి తెలియ‌నివి కావు. రాష్ట్రం విష‌యంలో మొండిగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు కాబ‌ట్టి, స్పందించ‌డం లేదు. అయితే, నీతీ ఆయోగ్ స‌మావేశంలో భాజ‌పాయేత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ఐక్య‌త చ‌ర్చ‌నీయం అవుతోంది కదా. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఆలోచ‌న ఏదైనా ప్ర‌భావితం చేస్తుందా అనేది చిన్న ఆశ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com