ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త పోరాటానికి పొలుపునిచ్చారు..! ప్రస్తుతం టీడీపీ సర్కారు ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే! దేశం ఎంపీలందరూ ప్యాకేజీ చట్టబద్ధత సాధించేందుకు కృషి చేస్తామని ఈ మధ్యనే డిసైడ్ చేసుకున్నారు! కలసికట్టుగా పోరాడేందుకు పార్లమెంటుకు వెళ్లారు. అంతకుముందు.. ప్రత్యేక హోదాపై కూడా ఇదే స్థాయిలో పోరాట స్ఫూర్తిని కనబరచారు..! మరి, ఆ పోరాట స్ఫూర్తితోనో ఏమో… ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కూడా పోరాడే పరిస్థితి వస్తోందని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం వెళ్లారు. పవన్ విద్యుత్ పరికరాల పరిశ్రమకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమెరికాలో ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్థావించారు. ‘‘ఈరోజున చాలామంది పిల్లలు అమెరికా వెళ్లారు. ఇటీవల ట్రంప్ వచ్చిన తరువాత, అక్కడ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. హెచ్ 1 బి వీసాలను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. దాంతో మనవాళ్లు బాధపడే పరిస్థితి వస్తోంది. అక్కడి ఉద్యోగాల కోసం మనం ఫైట్ చెయ్యాలి. ఉన్నపళంగా తీసేయడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో మన ప్రాంతంలో మనం ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా బాగా చెయ్యగలిగాం’’ అని చెప్పారు చంద్రబాబు.
సో… అమెరికాలో ఉద్యోగుల పరిస్థితిపై చంద్రబాబు స్పందన ఇది! ఈ మాటలు వింటుంటే.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట అనే వెనకటి సామెత గుర్తొస్తోంది. ఒకవేళ అమెరికాలో ఉంటున్న భారతీయుల ఉద్యోగులకు ఇబ్బంది వస్తే… దానిపై దేశవ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విదేశాంగ శాఖ కూడా ఉంది కదా! ముందుగా, మన స్థాయిలో మనకున్న సమస్యలపై పోరాడితే సరిపోతుంది కదా అనేది కొంతమంది స్పందన! ప్రత్యేక హోదాపై కేంద్రంతో గట్టిగా పోరాడి ఉంటే ఇవాళ్ల పరిస్థితి మరోలా ఉండేది. పోనీ.. ఇప్పుడైనా సరే, వచ్చిన ప్యాకేజీ అనేది నిజంగా పెద్ద ప్యాకేజీ అయితే దానికి చట్టబద్ధత తెచ్చుకోవడంపై కూడా బలంగా పోరాడినా బాగుంటుంది. కానీ, ఆ స్థాయి తెగువ తెలుగుదేశం నుంచీ ఆశించగలమా..?
‘ప్యాకేజీకి చట్టబద్ధత ఇస్తారని ఆశిస్తున్నాం… పన్నుల్లో రావాల్సిన వాటాలను ఇస్తారని ఎదురుచూస్తున్నాం’ అని ఇప్పటికీ ఆ సన్నాయి నొక్కులే నొక్కుతున్న పరిస్థితి! చంద్రబాబుకు విదేశీ మోజు ఎక్కువ అనే విమర్శ ఉంది కదా! అందుకే, ఆయన పోరాడాలంటే కనీసం అగ్రరాజ్యం అమెరికా స్థాయి ఉండాలేమో మరి.. అంటూ కొన్ని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.