సంపద సృష్టించి వాటితో పథకాలు, అభివృద్ధి పనులు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తొలి ఏడాదిలో ఈ విషయంలో 14 శాతం విజయాన్ని సాధించారు. జీఎస్టీని వసూళ్లలో 14 శాతం వృద్ధి కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు ఓ రకమైన నీరసం కనిపించింది. ప్రజలకు ఉపాధి ఉండేది కాదు. ఇసుక కొరతతో నిర్మాణాలు ఉండేవి కావు. ప్రభుత్వ పనులు లేకపోవడం, ఆర్థిక వ్యవహారాలు సాగకపోవడంతో వ్యవస్థ అంతా నీరసంగా ఉండేది. ఎవరిలోనూ ఉత్సాహం ఉండేది కాదు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ అంతా ఉస్సూరుమంటూ ఉండేవారు. అక్రమ మద్యం వ్యాపారులు, ఇసుక స్మగ్లింగ్ చేసే బిజినెస్ మాత్రమే సాగేవి. వాటిని వైసీపీ నేతలు చూసుకునేవారు. కానీ వైసీపీని పాతాళంలోకి నెట్టేసిన ఏడాదికే ఏపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. ప్రజలకు ఉపాధి పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
14 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వృద్ధి పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ వసూళ్లు 14శాతం పెరిగినట్లుగా తాజాగా లెక్కలు వచ్చాయి. మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. పెద్ద రాష్ట్రాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉంది. జీఎస్టీని పెరుగుదల .. అంటే.. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో భారీగా పెరుగుదల ఉండటమే. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే ప్రజలకు అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారికీ ఉపాధి అందుతుంది.
రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు
ప్రభుత్వం తరపున అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టే నిధుల్లో 30 శాతం వరకూ పన్నుల రూపంలో ప్రభుత్వానికే వస్తాయి. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వాలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిధుల సమీకరణకు .. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో, నగరాల్లో చిన్న చిన్న సందుల్లోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది..
హుషారుగా వ్యాపారవర్గాలు
ఏపీలో వ్యాపారవర్గాలకూ హుషారు వచ్చింది. గతంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో..ఐదు వేలో.. పదివేలో అకౌంట్లలో వేసినప్పుడు ఆ డబ్బులతో మాత్రమే ప్రజలు కొనుగోళ్లు చేసేవారు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు అన్ని చోట్లా వ్యాపార వ్యవహారాలు పెరుగుతున్నాయి. రైతులకు ప్రభుత్వం తరపున మద్దతు లభిస్తోంది. మొత్తంగా ఏపీ ఇప్పుడు కాస్త తేరుకుంటోంది. గతంలోలా హుషారుగా పరుగెత్తేందుకు శక్తిని కూడదీసుకుంటోంది. మూడేళ్లలో ఎవరూ ఊహించనంత అభివృద్ధిని చేసి చూపించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సంపద సృష్టి అంటే.. ప్రభుత్వ ఆదాయం పెంచడమే కాదు.. ప్రజల ఉపాధిని పెంచడం కూడా.