రాజకీయాల్లో అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చిన ఒక బాధ్యత. కానీ, కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సొంత సంస్థానాలుగా, తమను తాము అక్కడి చక్రవర్తులు గా భావిస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన హంగామా దీనికి పరాకాష్ట. తన మాట నెగ్గించుకోవడం కోసం ఏకంగా 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌ను వీడకుండా, చివరకు బాత్రూమ్లో దూరి తలుపులు వేసుకోవడం వంటి ఘటనలు వ్యవస్థలో పెరుగుతున్న అరాచకత్వానికి అద్దం పడుతున్నాయి.
ఒత్తిడి పెరిగిదే ధ్యానం చేయాలని చంద్రబాబు సలహా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిని గమనించి ఎమ్మెల్యేలకు మెడిటేషన్ చేయమని సలహా ఇవ్వడం వెనుక పెద్ద అంతరార్థమే ఉంది. నియోజకవర్గ పనుల ఒత్తిడిలో ఎమ్మెల్యేలు సంయమనం కోల్పోతున్నారని, మానసిక ప్రశాంతత ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన భావన. అయితే, కేవలం మెడిటేషన్ వల్ల మాత్రమే ఈ మొండితనం మారుతుందనుకోవడం పొరపాటే. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి, వ్యవస్థల కంటే తామే గొప్ప అని ఫీలయ్యే వారికి ఆ ధ్యానం కూడా ఒక రిలాక్సేషన్ టెక్నిక్ లాగా మారుతుందే తప్ప, మార్పు రాదు.
షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే దారికి!
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు కావాల్సింది కేవలం మెడిటేషన్ సలహా మాత్రమే కాదు, బలమైన షాక్ ట్రీట్మెంట్ . ఇప్పటికే పార్టీ అధినేత దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం, నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి సిద్ధమవ్వడం సరైన దిశలో పడిన అడుగులు. ఎవరైనా సరే చట్టం కంటే ఎక్కువ కాదు, అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే అది పార్టీకైనా, ప్రభుత్వానికైనా చెడ్డపేరు తెస్తుందనే సంకేతాలు గట్టిగా పంపాలి. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు ప్రజల ముందు వినయంగా ఉండాలి తప్ప, అధికారుల ముందు ప్రతాపం చూపడం వారి బలహీనతనే సూచిస్తుంది.
ప్రజలు ఇవ్వక ముందే పార్టీ ఇవ్వాలి!
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న తరుణంలో, ఎమ్మెల్యేల ప్రవర్తనపై ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇసుక, మద్యం వంటి వివాదాల్లో తలదూర్చడం, అధికారులను బెదిరించడం వంటి పనులు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి, ప్రభుత్వం ముందే మేల్కొని అదుపు తప్పిన ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇవ్వడం, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే వ్యవస్థను గాడిలో పెట్టగలదు. అధికారం శాశ్వతం కాదని, అది కేవలం ఐదేళ్ల ఒప్పందం మాత్రమేనని గుర్తుంచుకున్న రోజే నియోజకవర్గాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు.


