తెలుగుదేశం ప్రభుత్వం మే నెలలో రెండు ప్రతిష్టాత్మక పథకాలకు నగదు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం పథకాలకు నిధులు జమ చేయబోతున్నారు. స్కూళ్లు ప్రారంభానికి ముందే పిల్లలకు ఫీజులకు సాయం, అలాగే రైతులకు వర్షాకాలం ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. అందుకే మే నెలలోనే ఆ నగదును ఆయా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
తల్లికి వందనం పథకం అమలుపై అందరి దృష్టి
జగన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడి పేరుతో విద్యార్థులకు 13వేల రూపాయలు ఇచ్చేవారు. స్కూల్ ఫండింగ్ అని.. క్లీన్ ఫండింగ్ అని రెండు వేలు నొక్కేసేవాళ్లు. కానీ ప్రచారం మాత్రం పదిహేను వేలు దగ్గరే ఉండేది. అది కూడా కుటుంబంలో ఒక్కరికే ఆవకాశం దక్కేది. ఆ పథకం పేరుతో చేసిన సాయం కన్నా చేసుకున్న ప్రచారమే ఎక్కువగా ఉండేది. ప్రతి బిడ్డకు సాయం చేస్తామని మేనిఫెస్టోలో టీడీపీ పెట్టింది. ఆ ప్రకారం ఏడాది కాక ముందే మొదటి విడత జమ చేయడానికి నిర్ణయించుకుంది. ధనంతులైన వారికి కాకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రభు్త్వ, ప్రైవేటు స్కూల్స్లో చదువుతున్న అందరికీ పదిహేను వేలు చొప్పున జమ చేయనుంది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల నగదును మూడు విడతల్లో జమ చేయనున్నారు తొలి విడతను ఈ నెలలోనే జమ చేయనున్నారు.
కీలకమైన పథకాల అమలు పూర్తి చేసినట్లే !
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. మత్య్సకారులు సహా అనేక వర్గాల పథకాలను పునరుద్ధరించారు. బలహీనవర్గాల ఉపాధికి రుణాలిస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నవి తల్లికి వందనం, రైతుభరోసా, ఉచిత బస్సు మాత్రమే. మిగిలిన పథకాల అమలు దాదాపుగా పూర్తి అయింది. ఇతర పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ రెండు పథకాల నగదు బదిలీ పూర్తి అయిపోతే.. పథకాలు ఇవ్వలేదన్న భావన రాదు. అదే సమయంలో ఉచిత బస్సు పథకంపై ఇప్పటికే కసరత్తు పూర్తి అయింది. డిమాండ్ ను అంచనా వేసి దానికి తగ్గట్లుగా బస్సు సర్వీసుల్ని పెంచి..పథకాన్ని అమలు చేయనున్నారు.
నిధుల సమీకరణ పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాలంటే..దాదాపుగా పది వేల కోట్లకుపైగా కావాలి. ఇంత పెద్ద మొత్తం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన సర్దుబాటు అవుతుంది. అయితే వివిధ పద్దతుల ద్వారా వ్యూహాత్మకంగా గత ఆరు నెలలుగా నిధుల సమీకరణ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి సమీకరణ పూర్తి అయిందని నిధుల సమస్య రాదని చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ .. పథకాలకు నిధులు దొరకవేమోనని .. పథకాలకు డబ్బులు జమ చేయకపోతే.. ఏదో ఓ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉంది. కానీ అలాంటి అవకాశాలు లేవని తాజాగా తేలిపోవడంతో ఇప్పడుల్లా ఎలాంటి కార్యక్రమాలు వైసీపీ పెట్టుకోవడం లేదు. జూన్ తర్వాత చూద్దామని జగన్ చెబుతున్నారు.