ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా సరే సమస్యలు వస్తాయి. వారిని కంట్రోల్ లో పెట్టేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్త బెదిరింపులతో.. హెచ్చరికలతో వారు తగ్గే అవకాశం ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకూ ఇది వర్తిస్తుంది. కొంత మంది ఎమ్మెల్యేలు విజయగర్వమో.. అధికార దర్పమో కానీ.. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప దారికి రారు. దారికి వచ్చినా రాకపోయినా ఇతర ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికలా ఉంటుంది.
కొంత మంది ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు
కూటమికి తిరుగులేని మెజార్టీ వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల వల్ల చాలా మంది ప్రతిపక్ష నేతలు మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమకు ఎదురులేదని అనుకుంటున్నారు. ఎక్కువగా వ్యక్తిగత విజయాలతోనే వివాదాస్పదమవుతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందన్నట్లుగా ఉంటున్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం కలకలం రేపింది. ఆయన తన ఆడియో కాదని.. ఏఐ అని చెబుతున్నారు. కానీ అలాంటి అవకాశం కల్పించింది మాత్రం ఆయనే. ఆయన దూకుడు తనం.. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి రాజును అని ఫీల్ కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే.. ఓ మహిళ వివాదంలో ఇరుక్కున్నారు. ఇలాంటివి బయటకు వస్తే వారి పరువుకే కాదు.. పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. గౌరవనీయ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిగత వ్యవహారాలనూ మర్యాదగా ఉండేలా చూసుకోవాల్సి ఉంది.
పార్టీలో గ్రూపులతో కొంత మంది అరాచకం
పార్టీలో గ్రూపులు పాటిస్తూ… మరికొంత మంది ఎమ్మెల్యేలు అరాచకం సృష్టిస్తున్నారు. క్యాడర్ అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు చేయడం లేదు. గ్రూపులు పాటిస్తూ.. రచ్చ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో.. దగ్గుపాటి ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. చాలానియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు కొంత మంది సీనియర్లపై వ్యతిరేకత ఉందని.. ఇతరులకు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వారు.. పార్టీ సీనియర్లకు.. పార్టీ కోసం కష్టపడిన వారి కోసం కాకుండా.. గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.
షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే దారికి !
పార్టీని ఇబ్బందిపెడుతున్న వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలా ఆగ్రహం వ్యక్తం చేసి సరిపెడితే వారు దారికి రారని.. షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కొలికపూడి శ్రీనివాసరావు ఇలాగే చేస్తున్నారు. ఆయన పవర్ ను కట్ చేశారు. ఓ మహిళతో వివాదంలో చిక్కుకున్న సత్యవేడు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసులు కోర్టు కొట్టివేసినా సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయలేదు. అక్కడ టీడీపీ ప్రత్యామ్నాయం చూసుకుంది. అలాగే.. ఇప్పుడు రెచ్చిపోతున్న వారికీ.. గట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే.. ఇతరులు కాస్త జాగ్రత్తపడి దారిలోకి వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. నారా లోకేష్ ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాల్సి ఉంది.