మంత్రుల పనితీరు ఆశించిన మేర ఉండటం లేదని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో నేరుగానే చెప్పారు. ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. ఆయన ఎవరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారో బయటకు రాలేదు కానీ.. చంద్రబాబు ఇలా మంత్రులకు ప్రతీ కేబినెట్ భేటీలోనూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. కొంత మంది మంత్రులపై వచ్చే అభియోగాలు.. మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యం చూపించడం వంటివి చంద్రబాబుకు అసహనం కల్పిస్తున్నాయి. మార్చుకునేవారు మార్చుకుంటారని ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు.
రాజకీయ ఆరోపణల్ని తిప్పికొట్టని వైనం
చాలా కొద్ది మంది మంత్రులు మాత్రమే రోజూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. విధుల నిర్వహణలో ఎలా ఉన్నా.. రాజకీయంగా వైసీపీ చేసే ఆరోపణలు స్పందించాల్సిన బాధ్యత.. ముఖ్యంగా తమ శాఖలపై లేదా రాజకీయంగా చేసే ఇతర ఘాటు వ్యాఖ్యలపై స్పందించాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే టీడీపీలోని ఇతర నేతలు.. మంత్రులు స్పందించడానికి ఆలస్యమయింది. ఎందుకు స్పందించలేకపోతున్నారన్న ప్రశ్న చంద్రబాబుకు వస్తోంది. వైసీపీలో అయితే… ఎవరు మాట్లాడాలి.. ఏం మాట్లాడాలి అన్నదానిపై స్క్రిప్టులు వెళతాయి. కానీ టీడీపీలో అలా కాదు.. రాజకీయల నేతలకు స్వతంత్రం ఉంటుంది.
ఫేక్ న్యూస్ ప్రచారంపైనా నిర్లిప్తత
అయితే రాజకీయంగా స్పందించడానికి కొంత మంది మంత్రులు ఆలోచిస్తూ ఉండటానికి కారణాలు ఉన్నాయి. పొరపాటున ఓ మాట దొర్లినా.. తప్పుడు ఉద్దేశం లేకపోయినా వివాదం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని దాని వల్ల సమస్యలు వస్తాయని కొంత మంది సైలెంటుగా ఉంటున్నారు. కొంత మంది మన శాఖ కాదుగా.. మన జిల్లా కాదుగా అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో పార్టీ నేతలకు గైడ్ చేసేలా పార్టీలో ఓ వ్యవస్థ ఉంటుంది. వారి నుంచి వచ్చే సూచనలు కూడా కొంత మంది మంత్రులు పాటించడంలేదు.
అధికార విధుల విషయంలోనూ నిర్లక్ష్యం
రాజకీయంగానే కాక విధి నిర్వహణలోనూ కొంత మంది మంత్రుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ మంత్రి కంప్యూటర్ల కొనుగోళ్లలో గోల్ మాల్ పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే పేకాట శిబిరాల నిర్వహణ అంశం కూడా మీడియాలో వచ్చింది. ఇలాంటి వ్యవహారాలతో పాటు పలువురు తమ శాఖల విషయంలోనూ అంత చురుగ్గా ఉండటం లేదు. చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉండిపోతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సైతం తిప్పికొట్టలేకపోతున్నారు. దానిపై దృష్టిపెట్టడం లేదు. చంద్రబాబు ఆలోచనల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా తమ పనితీరును మార్చుకుంటే తప్ప .. కేబినెట్ లోని చాలా మందికి పదవుల గ్యారంటీ ఉండదని ఈసారి గట్టి సంకేతాలే వస్తున్నాయి.