పుష్కరాలకు ఆహ్వానించే పేరిట రాజకీయ మిషన్ చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర ప్రత్యేకత లేని ప్రహసనంగానే ముగిసింది. ఏ నిర్దిష్టత లేకుండా- నిర్మాణాత్మక చర్చ లేకుండా – షరామామూలుగా పరిశీలిస్తున్నారనే మాటలతో బయిటకు వచ్చారు. ప్రధాని మోడీ నుంచి ఎలాటి హామీ గాని స్పందన గాని బయిట ప్రపంచానికి విడుదల కాలేదు. మోడీకి గిట్టని పాత కాపు ఎల్కె అద్వానీయే ఏదేదో మాట్లాడ్డం మాత్రమే కనిపించింది. సరిగ్గా ఆ సమయానికి విజయవాడలో ఇదే సమస్యపై వామపక్షాలు నిరాహారదీక్ష చేస్తుంటే టిడిపి ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు బిజెపి కార్యాలయం దగ్గర కరసేవ చేసి వచ్చారు.అంటే తమ అధినేత యాత్ర ఏదో సాధిస్తుందని ఆయనకే నమ్మకం లేదన్నమాట. ఈ యాత్రకు ఒకరోజు ముందు బిజెపి రాష్ట్ర నేతలు హిట్లర్ పాలన అంటూ ఆయనపై ధ్వజమెత్తారు. ఇద్దరూ భాగస్వాములుగా పాలిస్తూనే ఇన్ని విన్యాసాలు సాగించడం ప్రజల ఇంగితాన్ని హేళన చేయడమే. నిజంగానే చంద్రబాబు, తెలుగుదేశం ఎంపిలు ప్రధానితోనూ కేంద్ర మంత్రులతోనూ జరిపిన చర్చలు చేసిన వినతులు ఏ కాస్త ఫలిమిచ్చినా ఈ పాటికి మోత మోగిపోయేది. వాస్తవానికి చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడైన బిజెపి నేత మాణిక్యాల రావు పుష్కరాలసభలోనే ప్రత్యేక హౌదా వుండబోదని కుండబద్దలుకొట్టి చెప్పేశారు.స్పెషల్ స్టేట్ తప్ప స్టేటస్ కాదన్నారు. వారే అలా అంటుంటే ముఖ్యమంత్రి బృందం ఎందుకు అవాస్తవ ప్రచారాలకు అవకాశం ఇస్తున్నారో అర్థం కాదు. నిన్నగాక మొన్న రాజ్యసభ సాక్షిగా చెప్పిన దానికి భిన్నంగా ప్రధాని మాట్లాడతారని ఎవరైనా అనుకున్నారా? అదే రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు బిల్లు ఓటింగు వాదనల సందర్బంలో ఇది మరింత స్పష్టం కావచ్చు. హౌదా రాకపోగా ఈ విధమైన దాగుడు మూతలతో ప్రజలను భ్రమపెట్టడం మరీ పొరబాటు.
అక్కరకు రాని చుట్టము/
మ్రొక్కిన వరమీని వేల్పు/,మొహరమున దా
నెక్కిన బారని గుర్రము/
గ్రక్కున విడవంగ వలయు ..నని సుమతీ శతకం ఎప్పుడో చెప్పింది. చంద్రబాబు అందుకు సిద్దపడకపోవచ్చు గాని దండగమారి కసరత్తులెందుకు?