పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలకు అంతు లేకుండా పోతోంది. అయితే, క్యాష్ లెస్ ఎకానమీ వస్తే ఇలాంటి సమస్యలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్నుంచీ చెబుతున్నారు. కరెన్సీ నోట్లతో పనిలేని ఆర్థిక లావాదేవీలు పెరగాలని అంటున్నారు. మొబైల్ బ్యాకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వినియోగం పెరగాలని చెబుతున్నారు. తాజాగా, కరెన్సీ నోట్ల కష్టాలపై అధికారులతో సమీక్షించారు. రూ. 2000 నోట్లు అందుబాటులోకి వచ్చినా సామాన్య ప్రజలకు వాటి ఉపయోగం ఉండటం లేదని, చిల్లర దొరకడం లేదని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… స్మార్ట్ బ్యాంకింగ్ సేవల్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలన్నారు!
మొబైల్ బ్యాంకింగ్‌పై డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ తరహా బ్యాంకింగ్ సౌకర్యాలు వినియోగించుకోవాలంటే అందరికీ సెల్ఫోన్లు కావాలి కదా! అందుకే, ఫోన్లు కొనుక్కునే పరిస్థితిలో ఎవరైనా ఉన్నా, ఫోన్లు లేకపోయినా అలాంటి వారందరికీ ప్రభుత్వమే ఫోన్లు ఇస్తుందని చెప్పారు. ముందుగా డ్వాక్రా మహిళకు మొబైల్ బ్యాంకింగ్‌పై శిక్షణ ఇచ్చి, ఆ తరువాత దశలవారీగా అందరూ ఈ తరహా లావాదేవీలు అలవాటు చేసుకోవాలన్నట్టుగా అభిప్రాయపడ్డారు!
క్యాష్ లెస్ ఎకానమీ మంచిదే. కానీ, మనదేశంలో అది ఎంతవరకూ సాధ్యం..? చేతిలోని రూ. 2000లకు చిల్లర దొరకడం లేదని ప్రజలు అవస్థలు పడుతుంటే… మొబైల్ బ్యాకింగ్ తర్ఫీదు గురించి మాట్లాడతారేంటో..! ప్రజలందరూ స్మార్ట్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటే అంతకంటే ఇంకేం కావాలి. కానీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందని గ్రామీణ ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం చేరని గ్రామాలు కొన్ని వందలు ఉన్నాయి. మరి, అలాంటి చోట్ల ఇ-బ్యాంకింగ్ శిక్షణ తీసుకున్నవారు కూడా ఏం చెయ్యలేరు కదా!
అయినా, ఏదైనా ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూడాలి. దీర్ఘకాలంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ రెండు ఒకేసారి జరగాలి. కానీ, రెండోదే ముందు జరిగితే ఏం ఉపయోగం..? డ్వాక్రా మహిళలకు ఫోన్లు ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది..? ఆ ఫోన్ల వినియోగానికి అవసరమైన నెట్వర్క్ ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా!