ఇంక ముసుగులో గుద్దులాటలు లేవు…అంతా ఓపెన్ ఫైటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నిన్న తన పార్టీ ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి తన వ్యూహాన్ని బహిర్గతం చేసారు. ఇంతవరకు తమ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని చూసే వైకాపా, కాంగ్రెస్ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు తెదేపాలో చేరుతున్నారని తెదేపా నేతలు చెప్పుకొనేవారు..ఆ పార్టీలో చేరుతున్నవారు కూడా అదే పాట పాడేవారు. తెలంగాణా రాష్ట్రంలోలాగే ఆంధ్రలో కూడా ప్రతిపక్షాలను బలహీనపరిచడం ద్వారా తెదేపాకు ఎదురులేకుండా చేసుకోవడానికే తెదేపా వలసలను ప్రోత్సహిస్తోందని అందరికీ తెలుసు. అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు కూడా దృవీకరించడం విశేషం.
ఆయన తన పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేసి తెదేపాకు ఎదురు లేకుండా చేసుకోవాలనుకొంటున్నట్లు చాలా విస్పష్టంగా చెప్పారు. అందుకోసం ప్రతిపక్షాలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను తెదేపాలో చేరేందుకు ప్రోత్సహిద్దామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో శాసనసభ స్థానాలు పెరుగాబోతున్నాయి కనుక పార్టీలో ఉన్న పాతవారు ఎవరూ కూడా కొత్తగా వచ్చి చేరుతున్న వారిని చూసి ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలలో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చులను పూర్తిగా పార్టీ భరిస్తుందని అయన హామీ ఇచ్చేరు. వచ్చే ఎన్నికలలో నామినేషన్-పోలింగ్ తేదీల మధ్య వ్యవధిని తగ్గించడానికి తను కృషి చేస్తానని చెప్పారు. తద్వారా ఎన్నికల ఖర్చు తగ్గించుకోవచ్చని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సింగపూర్ తరహాలో ఏక పార్టీ రాజకీయ విధానం అమలు చేయాలని తను కోరుకొంటున్నట్లు చెప్పారు. అక్కడ చాలా దశాబ్దాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉందని, మన రాష్ట్రంలో కూడా అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పరిపాలన సాగించగలిగితే శాస్వితంగా తెదేపాయే రాష్ట్రంలో అధికారంలో కొనసాగవచ్చని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేసారు. కనుక ఇప్పటి నుంచే పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ తమ తమ నియోజక వర్గాల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం గట్టిగా కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ వ్యవహారాలతో బాటు పార్టీ వ్యవహారాలపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు. ఇక నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను, కార్యకర్తలను వీలయినంత ఎక్కువ మందిని తెదేపాలో చేర్చుకొనేందుకు ప్రయత్నిద్దామని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో పేరుకి ప్రతిపక్షం ఉండాలి కనుక ఇద్దరో, ముగ్గురో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేందుకు అవకాశం ఇద్దామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com