పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న డేరింగ్ డాషింగ్ నిర్ణయం రాజకీయంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ కొంతమంది విమర్శిస్తుంటే, దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే నిర్ణయం ఇదీ అంటూ మిత్రపక్షాలు మెచ్చుకుంటున్నాయి. అయితే, ఈక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘చర్చ జరగాలి’ అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి, రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు వెనక చంద్రబాబు సలహా పనిచేసిందని అనుకున్నారు. ఎందుకంటే, ఆయనే కదా… నల్లధనం నిర్మూలించాలంటే ఈ నోట్లను రద్దు చేయాలని ప్రధానికి సూచించాను అని చెప్పింది. ఇప్పుడు కూడా తాము ముందేం చెప్పామనీ, కేంద్రం సానుకూలంగా స్పందించింది అంటూ మోడీ నిర్ణయంలో తమకీ వాటా ఉందంటూ క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు!
రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామనీ, రూ. 2000 నోటుపై చర్చ జరగాలని మాత్రం తాజాగా చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నిర్ణయం ప్రకటించిన వెంటనే ఫోన్ చేసి ఆయనకు అభినందనలు తెలిపానని చెప్పారు. రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం వల్ల లాభమేంటనీ, పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది అన్నారు. ఏదో ఒకచోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. కొన్నాళ్లపాటు ఈ నోట్లను చెలామణి చేసి, తరువాత విత్ డ్రా చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఈ నోట్లను ప్రవేశపెట్టడం వెనక ఏవైనా సాంకేతిక కారణాలు ఉంటే ఆర్బీఐ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులో ఉందీ, బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి, కావాలంటే చెక్స్ వాడుకోవచ్చు… ఇలాంటప్పుడు పెద్ద నోట్లు అని చంద్రబాబు ప్రశ్నించారు. తన అభిప్రాయమైతే… అసలు కరెన్సీ లేని రోజులు రావాలని కోరుకుంటున్నా అన్నారు!
నోట్ల రద్దు వెనక తన సూచనే ఉందని చెబుతూనే, ఇంకోపక్క రూ. 2000 నోటు రద్దు చేయాలని చంద్రబాబు మళ్లీ కొత్త చర్చను లేవనెత్తుతున్నారు. ఓరకంగా ఇది మంచి చర్చే. ఎందుకంటే, నల్లధనం అరికట్టాలంటే పెద్దపెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల సాధ్యమా అనేది కచ్చితంగా చర్చించాల్సిన విషయమే. అయితే, కరెన్సీ నోట్లు అవసరం లేదని రోజులు రావాలనడం… ఇప్పట్టో సాధ్యమా అనేది ప్రశ్న? ఎందుకంటే, రైతు బజార్కి వెళ్లి కూరలు కొనాలంటే కార్డ్ పేమెంట్స్ కుదరవు కదా! ఆర్టీసీ బస్సులు ఎక్కి టిక్కెట్లు తీసుకోవాలంటే చెక్స్ ఇస్తే తీసుకోరు కదా! చంద్రబాబు ఉద్దేశంలో టెక్నాలజీ అందరికీ అందిపోయింది కాబట్టి… కరెన్సీ నోట్లతో పనేముందని అనుకుంటున్నట్టున్నారు! కానీ, వాస్తవంలో కొన్ని మెట్రో సిటీల్లో కొంతశాతం ప్రజలు మాత్రమే కార్డ్స్ వాడుతున్నారు. మొత్తమ్మీద మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నట్టుగానే మెచ్చుకుని, రూ. 2000 నోటుపై చర్చ జరగాలంటూ మెలిక పెట్టారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే… రూ. 200 నోటు గురించి చంద్రబాబు ప్రస్థావించడం..!