మార్కాపురం ప్రాంత ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా, ఈ ప్రాంతానికి జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన ఈ ప్రాంత సాగు, తాగునీటి రంగానికి సరికొత్త ఊపిరి పోయనుంది.
దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను అసంపూర్తిగా వదిలేసి, కేవలం ప్రచారం కోసం జాతికి అంకితం ఇచ్చింది. కాలువ పటిష్ఠతను గాలికొదిలేయడం వల్ల పలుచోట్ల గండ్లు పడి, రైతాంగానికి నష్టం వాటిల్లిందని.. ఆ తప్పులను సరిదిద్ది శాశ్వత పరిష్కారం చూపేందుకే ఇప్పుడు ఈ పనులు చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ ఫీడర్ కాలువ లైనింగ్ , రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 456 కోట్లు మంజూరు చేసింది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అత్యంత నాణ్యతతో ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానున్నాయి.
మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడంపై స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, కరువు కోరల్లో ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించే దిశగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయంగానూ, సామాజికంగానూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
