మాచర్లలో చంద్రబాబు రాజకీయ అరాచకాలు చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేసి..ప్రజల భయపెట్టి, ఆస్తులు లాక్కునేవారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. గతంలో చాలా అరాచకాలు చేశారని వారందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. మాచర్లలో ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు వచ్చాయన్నారు. రాయలసీమలో ముఠాలను తొలగించినట్లుగా, పల్నాడులో రౌడీయిజం అంతు చూస్తామన్నారు.
పల్నాడులో మాచర్ల, గురజాల అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు. వైసీపీ హయాంలో ఈ అరాచకాలు శృతి మించిపోయాయి. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. టీడీపీ ఇంచార్జ్ ఉన్న బ్రహ్మారెడ్డి ఇంటిని తగలుబెట్టినా పట్టించుకున్న వారు లేరు. స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలో కనీసం నామినేషన్ వేయడానికి జనం భయపడిపోయారు. పట్టపగలు.. బొండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం జరిగింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల మధ్య గత ఎన్నికల్లో ఆ రాజకీయ రౌడీలను ప్రజలు తరిమికొట్టారు.
ఎన్ని అరాచకాలు చేసినా.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని స్వల్పకాలం మాత్రమే చట్టపరంగా జైల్లో ఉంచగలిగారు. ఆయన సోదరుడ్ని ఇప్పటి వరకూ పట్టుకోలేదు. ఆయన పేరుతో అరాచకాలు చేసిన తురక కిషోర్ కూడా జైలు నుంచి బయటకు వచ్చాడు. వీరందరూ.. మేము అధికారంలోకి వస్తే అని అప్పుడే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరికి మాటలతో హెచ్చరిస్తే సరిపోదని.. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. చంద్రబాబు చేసే హెచ్చరికలకు కాస్తంత రియాలిటీ వస్తుంది.