ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారి తప్పిన ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గతంలో 40 మంది వరకూ ఎమ్మల్యేలకు గట్టి హెచ్చరికలు పంపిస్తే వారిలో పదిహేను మంది దారిలోకి వచ్చారని ఇంకా పాతిక మంది మారలేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. త్వరలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటేస్తానని ఆయన అంటున్నారు. కానీ చంద్రబాబు మాటల్ని ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవడం లేదు. అంత గోల చేస్తున్న కొలికపూడిపైనే చర్యలు తీసుకోవడం లేదు.. మనపై ఏం తీసుకుంటారని అుకుంటున్నారు.
ఎప్పుడూ చర్యలు తీసుకోని చంద్రబాబు
చంద్రబాబు దారి తప్పిన ఎమ్మెల్యేలపై గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు అనేకం చేసినా, క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎమ్మెల్యేల్లో ఆ భయం కనిపించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది కానీ.. వాస్తవానికి అది అంత సులభం కాదు. చంద్రబాబు అంత ఈీగా నిర్ణయం తీసుకోరు. గతంలో తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన చంద్రబాబు బాబు, తీరా సమయం వచ్చేసరికి సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తంటారు.
దారికి తీసుకు రావడానికే హెచ్చరికలు
హెచ్చరికలు కేవలం ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి చేస్తున్న మైండ్ గేమ్ మాత్రమేనని, నిజంగా వేటు వేసే సాహసం ఆయన చేస్తారా అన్నది సందేహమే. ఈ ధైర్యంతోనే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. దాదాపుగా నలభై మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయి. అయితే చంద్రబాబు కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తారని చర్యలు తీసుకోరన్న ఉద్దేశం…. ఆయనకు ఉన్న మెతక వైఖరి వల్లే కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక, భూ దందాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం హెచ్చరికలతోనే కాలక్షేపం చేస్తే, అది అంతిమంగా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
దారిలోకి రాకపోతే వదిలించుకోవడమే ఉత్తమం!
ఎమ్మెల్యేలపై వేటు వేయడం అంత మంచి నిర్ణయం కాదు. కానీ వారిని ఉపేక్షిస్తే పెద్ద సమస్య అవుతుంది. చర్యలు తీసుకోకుండా కేవలం సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం లేదని, బాధ్యులైన వారిని పదవుల నుండి తొలగించినప్పుడే నాయకత్వానికి గౌరవం ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సారి కూడా కేవలం హెచ్చరికలతోనే సరిపెడతారా లేక నిజంగానే యాక్షన్ ఉంటుందా అన్న దానిపై టీడీపీలో అందరికీ ఓ క్లారిటీ ఉంది. అందుకే చంద్రబాబు హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.


