ఇద్దరి మౌనం,ఒకరిది ప్రహసనం

ఆఖరిబడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై మూడు పార్టీలు వాటి నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు భలే వింతగా వున్నాయి. పాలక తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు జరుపుతూనే సంయమనాన్ని ప్రబోధిస్తున్నారు. ఎంపిలతో సమావేశంలో ఢిల్లీ నుంచి ఫోన్‌ రావడంతో సీన్‌ మారిందనేవన్నీ కథలే. తెలుగు360 లో ఇది ఇలాగే జరగబోతుందని నేను మొదటే రాశాను. ఏది ఏమైనా బిజెపితో బంధాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు కృతనిశ్చయంతో వున్నారు. ఏదైనా తేడా వస్తే వైసీపీ ఆ జాగాలో జొరబడిపోతుందని టిడిపిలో ఆందోళన కూడా వుంది. అందుకే ప్రకటనలు నిరసనలు ఎన్ని చేసినా అంతిమంగా రాజీ పడటమే మిగులుతుంది.

ఓటుకు నోటు కేసుల కారణంగా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ఆరోపించే వైసీపీ నేత జగన్‌ అంతకన్నా దారుణమైన పరిస్థితిలో వున్నారు. ఆయనపై సిబిఐ కేసుల నుంచి బయిటపడటం కన్నా జగన్‌కు మరేదీ ముఖ్యం కాదు. దానికోసం బిజెపికి దగ్గరయ్యారు. ఆ కేసులో నిందితుడైన విజయసాయి రెడ్డి ఢిల్లీలో బిజెపి నేతల గడపగడపకూ తిరుగుతూ వున్నారట. ఎప్పుడూ మర్యాదలు చేయడం కేసుల నుంచి బయిటపడేయాలన్నట్టుగా సంకేతాలివ్వడం విజయసాయి డ్యూటీగా మారింది. బడ్జెట్‌ బాగుందని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లనే నిధులు రాలేదని ఆయన వింత ప్రకటన చేశారు. సాక్షి కూడా అలాగే చేసింది.రాష్ట్రానికి మొండి చెయ్యి మరోసారి చంద్రబాబు ప్రభుత్వవిఫలం అంటూ పొంతన లేని శీర్ఖిన నిచ్చింది. ఇవ్వని వాళ్లని వదలిపెట్టి తెచ్చుకోలేకపోయిన వాళ్లపై పడటం ఎలాటి రాజకీయ తర్కం? దీనిపై జగన్‌ మౌనం ఎందుకుని మాలాటివాళ్లం అడగడంతో ఇది సమిష్టిగా ప్రవేశపెట్టిందైనా తెలుగుదేశం మోసం చేస్తున్నదని పాదయాత్రలో వాదించారు ప్రత్యేక హౌదాపై విశాఖ యాత్ర కూడా చేశారు. బిజెపికి మద్దతు ఇవ్వడానికి అదే ప్రాతిపదిక అన్నారు.అది జరక్కుండానే ఎందుకు వారి చుట్టూ తిరుగుతున్నారు?ఎందుకు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు? గత కేసులలో సిబిఐ నెమ్మదిగా ఉచ్చు బిగిస్తున్న తీరువల్లనే వైసీపీ వెనుకడుగు వేస్తుందనేది స్పష్టంగాఅర్థమవుతున్నది.

ఈ ఇద్దరి కంటే జనసేన పవన్‌ కళ్యాణ్‌ పెదవి మెదపకపోవడం మరింత విపరీతంగావుంది. ఆయనకు కేసులు లేవు, రేసులోనూ లేనని చెబుతుంటారు. ఉన్నంతలో టిడిపికన్నా బిజెపిపైనే తన విమర్శలు కేంద్రీకరిస్తుంటారు.అలాటి వ్యక్తి బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని నిశితంగా ప్రస్తావించి నిరసించడం లేదు. ఈ రకమైన విమర్శలు ఎక్కువగా రావడంతో బయిటపడటం కోసం తమ నాయకుడు ప్రధాని మోడీని కలిసి సమస్యలు చెబుతారని జనసేన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.కాని ఇలాటి చిట్కాలతో సంతృప్తిపడే పరిస్థితి ప్రజల్లో లేదు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఏదో ప్రహసనమైనా నడుపుతున్నారు గాని జగన్‌ పవన్‌ దానికి కూడా సిద్ధపడటం లేదంటే ఏమనాలని ప్రజలు నివ్వెర పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.