మోక్షానికి వెళ్తే మొసలి ఎత్తుకెళ్లిపోయిందని వెనకటికో సామెత ఉంది! నల్లధనంపై పోరాటం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురౌతున్నట్టు చెప్పుకోవాలి. రూ. 500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ నోట్లను రద్దు చేయాలని తాను ఎప్పట్నుంచో చెబుతూ వచ్చాననీ, ప్రధానమంత్రికి లేఖ రాశానని కూడా చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2000 నోటుపై కూడా చర్చ జరగాలనీ, కొన్నాళ్ల తరువాత ఈ నోటును ఉపసంహరించుకోవాలని కూడా కేంద్రానికి చంద్రబాబు సూచించారు. మొత్తానికి… పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనక ప్రధానికి తాను చేసిన సూచన పనిచేసిందని చెప్పకనే చెప్పుకుంటున్నారు! ఈ అత్యుత్సాహం చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుతోందని తెలుస్తోంది! వ్యతిరేకత ఎక్కడా అంటే… నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో! ఎందుకంటే.. కాస్త వివరంగా చెప్పుకోవాల్సిందే!
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. భూముల ధరలు భారీగా పెరిగాయి. ఎకరా భూమి రూ. కోటి నుంచి రెండు కోట్లు వరకూ అమ్ముకున్న రైతులు ఉన్నారు. దీంతో రాత్రికి రాత్రే కొంతమంది కరోడ్‌పతులు అయిపోయారు. అనూహ్యంగా వచ్చిన సొమ్ముతో కొంతమంది ఇతర ప్రాంతాల్లో భూములు కొన్నారు. చాలామంది ఇళ్లలోనూ, బ్యాంకు లాకర్లలోనూ ఆ సొమ్ము దాచుకున్నారు. భారీ మొత్తం దాచుకోవాలంటే పెద్దనోట్ల కట్టల రూపంలోనే ఉంటాయి కదా. 2014 సంవత్సరాంతం నుంచి ఈ ఏడాది మార్చి నెలవరకూ దాదాపు 9500 భూలావాదేవీలు ఆ ప్రాంతంలో జరిగాయి. అంటే, దాదాపు 6500 ఎకరాల భూములపై ఆర్థిక లావాదేవీలు సాగాయన్నమాట. అలాగని, అంతా వైట్‌లో జరగలేదు సుమా! రూ. కోటి విలువ గల భూమికి దాదాపు రూ. 12 లక్షల లెక్కనే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంటే, మిగతా సొమ్మంతా బ్లాక్ మనీ కదా! ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియని రహస్యమా..!
అయితే, రాజధాని ప్రాంత భూముల ధరలు పెరిగి రైతులు లాభపడ్డారని ఒక పక్క చెబుతూ… ఇంకోపక్క పెద్ద నోట్లను రద్దు చేయమని చంద్రబాబే ప్రధానికి సలహా ఇవ్వడం స్థానికుల్లో వ్యతిరేకతకు కారణమౌతోంది! బయటకి చెప్పలేకపోతున్నారుగానీ… ‘చంద్రబాబు మమల్ని బాగానే ఉబ్బేసి బుక్ చేసేశారు’ అంటూ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సో.. నల్లధనంపై పోరాటం అంటూ చంద్రబాబు చెప్పుకుంటున్న గొప్పలు ఇలా బూమ్రాంగ్ అవుతున్నాయి! కేంద్ర నిర్ణయంతో మనకేంటి సంబంధం అని కామ్‌గా కూర్చుని ఉంటే.. ఈ పరిస్థితి రాదు కదా! క్రెడిట్ గెయిన్ కోసం పాకులాడి, సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.