చంద్రబాబు గారూ! ఏమిటీ మాటలు ?

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న శనివారం రోజంతా కాస్త తేడాగా మాట్లాడారు. మూడు సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు విచిత్రంగా, వివాదాలకు తావిచ్చేవిధంగా ఉన్నాయి. సాక్షిపత్రిక తనపై, తన కుటుంబంపై వెలువరిస్తున్న కథనాలపై స్పందిస్తూ, తన వంటిపై కనీసం ఉంగరం, వాచీ కూడా ఉండవని, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని, తనలాంటివాడిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నారని వాపోయారు. బాబుగారి ఆవేదన పెద్ద చర్చనీయాంశమయింది. ఆయన అమాయకంగా అన్నారో, ఫ్లోలో అన్నారో తెలియదుగానీ, ఆ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఉంగరం, వాచీ పెట్టుకోకుంటే అర్థం డబ్బులు లేవని ఎవరయినా అనుకుంటారా, ఆయనకేమైనా ఎలర్జీయేమోననుకుంటారు గానీ. సరే, రు.913 కోట్ల విలువ చేసే హెరిటేజ్ ఆస్తులను పక్కన పెట్టినా కుటుంబం మొత్తం ఆస్తులు రు.44 కోట్లని మీరే ప్రకటించారు. ఇప్పుడు ఉంగరం, వాచీ కూడా లేదు, జేబులో రూపాయి కూడా లేదు అంటే నమ్మటానికి జనం ఏమైనా చెవుల్లో పూలు పెట్టుకుని కనబడుతున్నారా! ఒకవైపు హెలికాప్టర్, ప్రత్యేక విమానం లేకుండా మీరు బయటకు కాలు కదపటంలేదని సర్వత్రా వినిపిస్తుండగా, ఇలా బీద అరుపులు అరవటం భావ్యంగా లేదు బాబుగారూ! ఇలా మాట్లాడటం వలన ప్రజలు మిమ్మల్ని మాణిక్ సర్కార్, మనోహర్ పారికర్, ఏకే అంటోనీల లాంటి నిజాయతీపరుల జాబితాలో చేరుస్తారని భావిస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. నిన్ననే మరో విచిత్రమైన మాట కూడా మాట్లాడారు బాబుగారు. అదెలా సాధ్యమో ఆయనకే తెలియాలి. సాక్షి పేపర్‌ ఎటాచ్‌మెంట్‌లో ఉందని, త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సాక్షి పేపర్ ఆస్తులను ఎటాచ్ చేయాలని ఈడీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన మాట నిజమే కాని, దానిపై జగన్ స్టే తెచ్చుకున్నారు. ఆ ఉత్తర్వులు అమలు కాలేదు… విషయం కోర్ట్ పరిధిలో ఉంది. ఎటాచ్ కాని ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారో అర్థంకాకుండా ఉంది. మరోవైపు నిన్ననే కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే బాబుగారి అదృష్టంకొద్దీ, ఈ వ్యాఖ్యలను వైసీపీ కరపత్రిక మీడియా సంస్థలు మాత్రమే రికార్డ్ చేశాయి , మిగిలిన ఏ మీడియాలో కూడా అది రికార్డ్ కాలేదు. ఇవే కాదు చంద్రబాబు ఈ మధ్య చాలా సందర్భాలలో వివాదాలకు తావిచ్చేటట్లుగా మాట్లాడుతున్నారు. ఇటీవల కులాలు-రిజర్వేషన్‌లపై మాట్లాడుతూ, ఎస్‌సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించారు. దీనిపై దళితులు, మేధావులు కూడా మండిపడ్డారు. అయితే ఆ మాటలు యథాలాపంగా అన్నవే కాబట్టి అది పెద్ద రాద్ధాంతం కాలేదు. ఓటుకు నోటు కేసు సమయంలో ఒక బహిరంగ సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “నీకు ఏసీబీ ఉంటే, నాకూ ఏసీబీ ఉంది, నీకు పోలీసులు ఉంటే నాకూ పోలీసులు ఉన్నారు” అంటూ అసంబద్ధంగా, అపరిపక్వంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. బాబుగారు మాటలను కాస్త ఆచి తూచి వాడితే బాగుంటుంది. ఎవరన్నా చెప్పండయ్యా బాబుగారికి! ఆయన్ను అట్టా వదిలేయమాకండి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com