జనసేన అధినేత ఎక్కడ సభ పెట్టినా తరువాత వినిపించే విమర్శ… ఆయనకి రాజకీయ పరిణితి చాలదని! ఏదో ఆవేశంతో నాలుగు మాట్లాడేసి, జనాల్ని ఊగించే ప్రయత్నం తప్ప… దమ్మున్న అంశాలు ప్రసంగంలో లేవని కూడా కొంతమంది విశ్లేషిస్తారు. ఈ అభిప్రాయాలను అనంతపురం సభ ద్వారా పవన్ కల్యాణ్ తుడిచేశారు అని చెప్పాలి. చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెబుతూనే.. ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా నర్మగర్భంగా మాట్లాడారు అని చెప్పాలి. గత సభలతో పోల్చితే పవన్ కొంత మారారు! కాకినాడ సభలో మాదిరిగా ఊరికే ప్రతీదానికీ ఊగిపోకుండా ప్రసంగించిన తీరు బాగుందని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడిలానే కొన్ని విషయాలను కొన్ని కీలకాంశాలపై మాట్లాడుతూ… ఇన్ డైరెక్ట్ గా ఇవాల్సిన సందేశాలు, ఇవ్వాలనుకున్నవారికి ఇచ్చారని చెప్పాలి.
కుటుంబ మమకారాన్నీ కులాన్నీ విడిచిపెట్టి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అధికార పార్టీ తెలుగుదేశం ఒక ప్రాంతానికీ, ఒక కులానికీ, ఒక వర్గానికీ చెందిన పార్టీగా పరిమితమై పనిచేస్తోందనీ, దీని వల్ల మరోసారి ప్రాంతీయ అసమానతలు ప్రబలే అవకాశం ఉందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వేర్పాటు వాదం వినిపించే ప్రమాదం ఉందన్నారు. తెలుగుదేశం నాయకుల అవినీతి పెరిగిపోతోందోని బయట విమర్శించుకుంటున్నారని కూడా పవన్ చెప్పడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో వాస్తవాలను పవన్ బయటపెట్టారని చెప్పుకోవాలి.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ కూడా స్పష్టత ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారా, లేదా మళ్లీ ఎవరికో మద్దతు ఇస్తారా అనే చర్చ చాలారోజుల నుంచి ఉంది. అయితే, రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఎవరు ఓటు వేసినా వెయ్యకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటాని పవన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు, జగన్ తనకు శత్రువులేం కాదనీ.. తన పోరాటం వ్యక్తులపై కాదనీ, విధానాలపై అని చెప్పారు. అంటే, ఆంధ్రా రాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయం తానే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టే కదా! భాజపాతో జనసేన కలిసి పనిచేస్తుందా అనే అనుమానాలపై కూడా స్పష్టత ఇచ్చేసినట్టే.
రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న పన్నుల వాటానే ప్యాకేజీ రూపంలో కేంద్రం లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్యాకేజీ విషయంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్ల మాటల్లోనే తేడాలు ఉన్నాయనీ, ఇవేవీ ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్యాకేజీని అంగీకరించారో అర్థం కావడం లేదన్నారు. ప్యాకేజీ తెచ్చినవారికి అహో ఆంధ్రభోజా అంటూ సన్మానాలు ఎలా చేస్తారు, వారు మాత్రం ఎలా చేయించుకుంటారు… వెంకయ్య నాయుడు తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. గత సభల్లో నాయకుల పేర్లతో నేరుగా విమర్శించిన పవన్… ఈసారి, అలాంటి ఆవేశాన్ని కాస్త తగ్గించి పరోక్ష విమర్శలు పెంచారు.
గత సభల మాదిరిగా నినాదాలు, ఊగిపోవడాలు, లింకుల్లోని మాటలు… ఇలాంటివేవీ లేకుండా, అనంతపురం సభకి బాగా హోం వర్క్ చేసుకుని వచ్చినట్టున్నారు పవన్ కల్యాణ్. అయితే, ఇంకా మారాల్సింది చాలానే ఉంది. పవన్ కల్యాణ్‌కి ఆవేశం వచ్చినప్పుడే ఇలాంటి సభలు పెడతారనే విమర్శ ఉంది. ఒక సభ తరువాత ఆయన ఏమైపోతాడో ఎవ్వరికీ తెలీదు. తరువాత సభ ఎక్కడ ఉంటుందో తెలీదు. ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఈ వైఖరిలో కూడా మార్పు రావాల్సి ఉంది. ఇంతకీ జనసేన కార్యాచరణ ఏంటీ… వచ్చే ఎన్నికలకు రెడీ అని పవన్ కల్యాణ్ చెబుతున్నా, వ్యవస్థాపరంగా పార్టీ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. అన్నిటికీ మించి… ఈ వరుస సభల ద్వారా ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతోందా.? ఉద్యమం అంటే పవన్ కల్యాణ్ ఒక్కరే మీటింగులు పెట్టి మాట్లాడటమా..? క్షేత్రస్థాయి నుంచి దశలవారీగా కమిటీల వారీగా ఉద్యమ నిర్మాణం ఉండాలి కదా. ఈ దిశగా కూడా పవన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది.