తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి! ఆ ’శక్తి’ గల అభ్యర్ధుల కోసం అధిష్ఠానం వెతుకాలట ప్రారంభించిందట! నిజమేనండీ… టి. కాంగ్రెస్‌ని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర పార్టీలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీసీసీ పీటంతోపాటు, మొత్తం కమిటీనే ప్రక్షాళన చేయాలని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోందట.
నిజానికి, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మాట్లాడే నాయకులే ఎక్కువ, చేతల్లో చూపేవారు తక్కువ! కాస్తోకూస్తో దమ్మున్న నాయకులు ఉంటే, వారు తెరాసలోకి ఫిరాయించారు. ఉన్నవారిలో కూడా ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారో నమ్మకం లేని పరిస్థితి. పోనీ… అనుభవంగల నేతలు ఉన్నారంటే, వారి తీరు తలోరకం! మూలుగుతున్న నక్కపై ఎప్పటికప్పుడు తాటిపండ్లు పడేయడం జానారెడ్డికి అలవాటు. తెరాసపై ఏదో పోరాటం కాంగ్రెస్ చేపట్టగానే, ఆయన కేసీఆర్‌ను మెచ్చుకుంటారు! సొంత పార్టీనే ఇరుకున పడేసే ప్రకటనలు చేస్తుంటారు. ఇక, మరో సీనియర్ నేత వీ హన్మంతరావు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాలకే తప్ప, విధానపరంగా పార్టీకి పనికిరావడం లేదని ఆ పార్టీ వారే చెవులు కొరుక్కుంటారు. ఇక, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పరిస్థితి.. వన్ మ్యాన్ ఆర్మీ! ఆయనకు వెన్నుదన్నుగా నిలిచేవారు ఎంతమంది ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. పార్టీలో కాస్త బలంగా కనిపించే కోమటిరెడ్డి సోదరుల పరిస్థితి ఇంకోరకం.
ఏం చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం లేదనే అసంతృప్తి అదిష్టానికి బాగా ఉందట! అందుకే, సమూల మార్పులకు త్వరలో శ్రీకారం చుడుతుందని తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు పార్టీకి దమ్మున్న నేతలూ సొమ్మున్న నేతలు కూడా అవసరం అని భావిస్తోందట! అధికార తెరాసను తట్టుకోవాలంటే ఆర్థికంగా కూడా సమర్థత కలిగిన వారు పార్టీలో ఉండాలని అధిష్ఠానం అభిలషిస్తోందని చెప్పుకుంటున్నారు.
అయితే, ఇదే తరుణంలో కోమటిరెడ్డి సోదరులు పార్టీకి పునర్వైభవం తెస్తామనీ, పీసీసీ పీఠం తమకు ఇవ్వాలనే మెలిక పెడుతున్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. అంటే, అధిష్ఠానం కోరుకుంటున్న దమ్ముతోపాటు ఇతర లక్షణాలు తమకు ఉన్నాయన్నట్టు సంకేతాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. పీసీసీలో మార్పులు చేయాల్సి వస్తే, ఆ బాధ్యతలు తమకు ఇస్తే, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవరకూ శ్రమిస్తామని చెబుతున్నారట! అధిష్ఠానం కోరుకుంటున్న అర్హతలు వారిలో ఉన్నాయని స్వయం ప్రకటన చేసుకుంటున్నారనుకోవాలి! ఏదేమైనా, టి. కాంగ్రెస్‌లో మార్పులు తప్పేట్టుగా లేవు. పార్టీలో ఇప్పుడున్నవారే ప్రాధాన్యత పెరుగుతుందో, లేదా కొత్త ముఖాలు వస్తాయో చూడాలి.