కేంద్ర మంత్రి వర్గాన్ని మార్చాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. పని చేయని మంత్రుల్ని తొలగించి.. పని చేసేవారిని అలాగే.. రాబోతున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉపరాష్ట్రపతికి అభ్యర్థిని కూడా ఎంపిక చేయాల్సి ఉంది.
ఉపరాష్ట్రపతిగా బీజేపీ సీనియర్ నేతను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన రాజ్ నాథ్ సింగ్ లేదా గడ్కరీ కావొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవికి కూడా ఆయన పేరు వినిపిస్తోంది. ఇలా కీలకమైన పదవులకు ఈ కేంద్ర మంత్రుల్ని సర్దుబాటు చేస్తే.. కీలక పదవులు ఖాళీ అవుతాయి.
ఈ సారి ప్రధాని మోదీ ఆరెస్సెస్ సూచనలకు ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు. అందుకే మార్పు చేర్పులు భారీగానే ఉంటాయని అంచనాకు వస్తున్నారు. టీడీపీకి మరో సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ తాను తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పని చేస్తానని కేంద్ర మంత్రి పదవి వద్దని అంటున్నారు. ఆయన స్థానంలో లక్ష్మణ్‌కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు.
ఇరవై ఒకటో తేదీ లోపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కేబినెట్ సమీకరణాలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయి. అందుకే ఆ లోపే.. మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.