ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు కీలక ముందడుగు వేయబోతున్నారు. ప్రాథమిక చార్జ్ షీట్‌ను సిద్ధం చేశారు. ఇందులో ఎక్కడా చిన్న లూప్ హోల్ లేకుండా చూసుకుంటున్నారు. న్యాయపరమైన అన్ని పరిశీలనలు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయబోతున్నారు. ఈ చార్జిషీటు అంతిమ లక్ష్యం.. సూత్రధారిని కలుగు నుంచి బయటకు తీసుకు రావడమే . ఆ సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు. అందుకే అంతా తానే కొట్టేసినప్పటికీ.. దొరికిపోతే తన పాత్రమే లేకుండా ఉండాలని ఆయన చాలా ప్లాన్లు వేశారు. వాటిని సిట్ ఎంత మేరకు వెలుగులోకి తెచ్చిందన్నది చార్జిషీటులో తెలియనుంది.
లిక్కర్ స్కాం.. పేదల రక్తమాంసాలు పీల్చినా దోపిడీ
లిక్కర్ స్కాం అనేది బహిరంగంగా జరిగిన దోపిడీ. అది కేవలం డబ్బు దోపిడీ కాదు. ప్రజల ఆరోగ్యాలను సైతం దోపిడీ చేసిన స్కాం. నిరుపేదలైన వారి రక్త మాంసాలను పిండు స్కాం. ఇతర బ్రాండ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసి.. తాము తయారు చేసిన మద్యాన్ని మాత్రమే అమ్మించి విపరీతంగా ధరలు పెంచుకుని అమ్మేసుకున్న స్కాం. పేదల మద్యం అలవాటును అవకాశంగా చేసుకుని వారిని నిలువుదోపిడీ చేసిన స్కాం. ఇలాంటి స్కాం భారత దేశ చరిత్రలో ఎవరూ చూసి ఉండరు. ఆ విషయాన్ని సిట్ తన చార్జిషీట్లో బలంగా చెప్పాల్సిన ఉంది.
పూర్తి వివరాలు తెలిస్తే నాటి పాలకుల క్రూరత్వంపై స్పష్టత
పాలకులు ఎవరైనా ప్రజల పట్ల కాస్త బాధ్యతతో ఉంటారు. వారే తమకు అధికారం ఇచ్చారన్న సంగతిని మనసులో పెట్టుకుంటారు. కానీ డబ్బు జబ్బు చేసిన వైసీపీ పెద్దలు పూర్తిగా తమకు ఓట్లు వేసిన వారినే అడ్డగోలుగా స్కాములు చేసి మరీ దోచుకున్నారు. చిన్న చిన్న టీ దుకాణాల్లోనూ ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకుంటున్న సమయంలో వారు పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కే పెద్దపీట వేశారంటేనే ఇందులో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పదకొండు మందిని అరెస్టు చేశారు. దుబాయ్ వరకూ స్కాంలో పాత్రధారులు ఉపయోగించుకున్నారు డెన్ల వరకూ అన్నింటినీ గుర్తించారు. ఆధారాలు వెలుగులోకి తెచ్చారు. దొరికిన నగదును సీజ్ చేశారు. ఇంత పెద్ద స్కాం జరగాలంటే పూర్తిగా పెద్ద స్థాయి వ్యక్తుల పర్యవేక్షణలోనే జరుగుతుంది.
శనివారం లేదా సోమవారం చార్జిషీటు దాఖలు
శనివారం సిట్ దాఖలు చేయబోయే చార్జిషీటులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శనివారం మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం సిట్ ఆఫీసుకు విచారణకు వస్తానని మిథున్ రెడ్డి సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయన చెప్పే వివరాలతో చార్జిషీట్ ను అప్ డేట్ చేయాలనుకుంటే.. సోమవారం ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.