ఓ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెరిగితే, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉంటే.. రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతుంది. దానికి ఉదాహరణకు చర్లపల్లి రైల్వే స్టేషన్. గతంలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ఉందా లేదా అన్నట్లుగా ఉండేది. కానీ సికింద్రాబాద్ స్టేషన్ పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి స్టేషన్ ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే రైళ్లను పెంచుతున్నారు. ఇది హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కు బూమ్ రావడానికి కారణం అవుతోంది.
చర్లపల్లి, ఈసీఐఎల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాలలో భూముల విక్రయాలకు రైల్వే స్టేషన్ ఓ ప్లస్ పాయింట్ గామారింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR)కి సమీపంలో ఉండటం, రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతంలో భూలావాదేవీలు పెరుగుతున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను రూ. 430 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ రోజుకు 50,000 మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఈ ప్రాంతాన్ని రవాణా కేంద్రంగా మార్చడంతో, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగింది.
హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో రియల్ బిజినెస్ లో తూర్పు ప్రాంతం వాటా మొదటి నుంచి తక్కువే. వెస్ట్ ప్రాంతంలోనే సగానికిపైగా వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు తూర్పు ప్రాంతంలో కూడా పుంజుకుంటోంది. చర్లపల్లిలో చాలా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటి బుకింగ్స్ కోసం ఇటీవలి కాలంలో ఎంక్వయిరీలు కూడా పెరిగాయి. స్టేషన్ అభివృద్ధి , ORR సామీప్యత కారణంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, గత కొన్ని సంవత్సరాలలో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఆకర్షణీయంగా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే హాట్ ప్రాపర్టీగా మారాలంటే.. గ్రేటర్ , ప్రభుత్వ వర్గాలు ఇంకా కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సిన ఉంది. IOCL నుండి చర్లపల్లికి వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉంది. రోడ్లను విస్తరించడానికి GHMC సర్వేలు చేసింది, కానీ పనులు పూర్తి కాలేదు. ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తే.. రియల్ బిజినెస్‌కు తిరుగు ఉండదు.