ఒకప్పుడు ఐపీఎల్ అంటే చెన్నై, చెన్నై అంటే ఐపీఎల్ అన్నట్టు ఉండేది. ఆ జట్టు 5 సార్లు ఛాంపియన్ గా అవతరించింది. చెన్నైని గెలవడం అంటే, ఐపీఎల్ కప్పు కొట్టినట్టే అనుకొనేవాళ్లు. అయితే.. ఇప్పుడు అదంతా గతం. గత కొన్ని సీజన్లుగా చెన్నై అభిమానుల్ని నిరాశ పరుస్తోంది. 2025 ఐపీఎల్ చెన్నైకి పీడకల. ఇప్పుడు కూడా అదే తంతు. వరుస పరాజయాలతో హ్యాట్రిక్ సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. మూడింట్లో ఒక్క గెలుపు కూడా లేదు. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆదివారం నాటి మ్యాచ్లో పేలవమైన బౌలింగ్, ప్రణాళిక లేమితో.. మరో ఘోర పరాజయం మూటగట్టుకొంది. ఈ ఐపీఎల్ లో చెన్నై మళ్లీ పుంజుకోవాలి, ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే అద్భుతాలు జరగాల్సిందే.
తొలి ఆరు మ్యాచ్ లకు ధోనీ అందుబాటులో లేకపోవడం చెన్నైకి తీరని లోటు. ధోనీ అద్భుతమైన ఫామ్ లో లేడు కానీ, తనుంటే జట్టుకు కొండంత బలం. ఏప్రిల్ 23 నుంచి ధోనీ అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది. అప్పటికి జట్టు పరిస్థితి ఏమిటో? ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తుంటే ఐపీఎల్ లో మిగిలిన ఏ జట్టయినా సరే, చెన్నైని సులభంగా ఓడిస్తుందనిపిస్తోంది. ఒకప్పుడు రైనా, అశ్విన్, డూప్లెసిస్, మెకల్లమ్, బ్రావో లాంటి సూపర్ స్టార్లు ఉండేవాళ్లు. టీమ్ 11లో స్థానం సంపాదించుకోవడమే చాలా కష్టంగా ఉండేది. రిజర్వ్ బెంచ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. రైనా రిటైర్ అయిపోయాడు. ధోనీ ఫామ్ కోల్పోయాడు. జట్టు కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి టీమ్ సంజూ శాంసన్ పై ఎక్కువ ఆధారపడిపోయింది. వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన సంజూ… ఈ ఐపీఎల్ లో దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. దుబే, రుతురాజ్ గైక్వాడ్ మినహా.. ఎవరికీ పెద్దగా అనుభవం లేదు. బౌలింగ్ లో అయితే మరీ పేలవంగా కనిపిస్తోంది. బెంగళూరు జట్టు ఈ బౌలింగ్ లేమిని ఆసరగా తీసుకొని 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఖలీల్ అహ్మద్ ఒక్కడే కాస్త నిలకడగా బౌలింగ్ వేస్తున్నాడు. నూర్ తో సహా అందరూ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు.
ధోనీ వస్తే.. ఈ ఐపీఎల్ లో చెన్నై స్వరూపమే మారిపోతుందని చెప్పలేం కానీ, ధోనీ వస్తే కాస్త ఉత్సాహం వస్తుంది. మైదానం లో ధోనీ హ్యూహాలు బాగా పనికొస్తాయి. చివర్లో డాషింగ్ బ్యాటింగ్ చేయగల అనుభవజ్ఙుడు దొరుకుతాడు. కానీ ఈలోగా చెన్నై పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం.