లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జైలు శిక్ష నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందే మార్గాన్ని వెతుక్కున్నారు. తన అనారోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఆయన, వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం విజయవాడ సమీపంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో 15 రోజుల పాటు ఉండేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
వెరికోస్ వెయిన్స్ కాళ్ళలోని సిరలకు సంబంధించిన వ్యాధి. సాధారణంగా సిరల్లో ఉండే వాల్వ్‌లు రక్తాన్ని గుండె వైపు పంపిస్తాయి. ఈ వాల్వ్‌లు బలహీనపడినా లేదా దెబ్బతిన్నా రక్తం తిరిగి కాళ్ళలోనే నిలిచిపోయి, సిరలు ఉబ్బి నీలం లేదా ఊదా రంగులోకి మారుతాయి. ఈ సమస్య తనకు ఉందని చెప్పి పదే పదే చెవిరెడ్డి ఆస్పత్రికి వెళ్తున్నారు. అక్కడ వారు అంతా బాగానే ఉందని పంపిస్తున్నా.. ఆయన మాత్రం ఫిర్యాదులు మానలేదు. ఆశ్రమానికి వెళ్తానని గతంలో ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కానీ అలుపెరుగని ప్రయత్నం చేసిన ఆయన ఈ సారి అనుమతి తెచ్చుకున్నారు.
చెవిరెడ్డి ఇదే సమస్యను చూపిస్తూ పదే పదే కోర్టును ఆశ్రయించడం వెనుక కేవలం అనారోగ్యమే కాకుండా, రాజకీయ వ్యూహం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జైలు వాతావరణం నుంచి బయటపడటానికి, బయట ఆశ్రమంలో ఉంటే తన వ్యవహారాలు చక్కబెట్టడానికి అవసరమైన పరిస్థితులు ఉంటాయన్న కారణంగానే ఆయన ఈ ప్రయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు.