జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాగైనా బయటకు రావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ బెయిల్ రావడం లేదు. బెయిల్ రాకపోతే పోయింది కనీసం అనారోగ్యం పేరుతో కాస్త విలాసంగా ఉండే ఆస్పత్రిలో చేరాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల తనకు నడుం నొప్పి అని.. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో చికిత్స కోసం అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం చెవిరెడ్డి పిటిషన్ ను కొట్టేసింది ఏసీబీ కోర్టు.
చెవిరెడ్డి ఫలానా రోగానికి చికిత్స అంటూ పిటిషన్ వేయడం ఇదే మొదటి సారి కాదు. మొదటగా బెయిల్ పిటిషన్ వేయడానికి ముందు తనకు బోలెడన్ని రోగాలున్నాయని తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని.. ఆయనే కోర్టుకు చాయిస్ ఇచ్చారు. ఎక్కడ చికిత్స తీసుకోవాలో కూడా ఆయనే డిసైడ్ చేసుకున్నారన్నమాట. అయితే కోర్టు నమ్మలేదు. ఆయనకు వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు చేయించి కోర్టుకు నివేదికలు సమర్పించారు. కానీ ఆయన మాత్రం ఓ సారి పంటి నొప్పి అని..మరొసారి వెన్నునొప్పి అని ఆస్పత్రులకు పంపాలని పిటిషన్లు వేస్తూనే ఉన్నారు.
లిక్కర్ స్కాం నిందితులంతా ఓ రకంగా ఉంటే.. చెవిరెడ్డి వ్యవహారశైలి మాత్రం మరో రకంగా ఉంటుంది. కోర్టులో న్యాయమూర్తుల ముందు వినయంగా ఉంటారు. కన్నీరు పెట్టుకుంటారు. బయట మాత్రం పోలీసుల్ని, దర్యాప్తు అధికారుల్ని అంతు చూస్తానని హెచ్చరిస్తూంటారు. ఆయన తీరు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతూంటారు. కానీ ఆయన మాత్రం డ్రామాలు కంటిన్యూ చేస్తూనే ఉంటారు.

