కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సమస్యల్లో తాజాగా సీనియర్ నేత చిదంబరం కూడా చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పుల్ని ఎప్పటికప్పుడు బయట పెట్టికొత్తగా చర్చ పెట్టి పార్టీని సమస్యల్లోకి నెడుతున్నారు. పాకిస్తాన్ పై యుద్ధం చేయకపోవడానికి.. ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టడానికి జరిగిన పరిణామాల్ని ఇటీవల వివరించి..తప్పంతా మా పార్టీదేనని అంగీకరిస్తున్నారు. ఇది బీజేపీకి ఆయుధంగా మారుతోంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టడం తప్పేనని అంగీకారం
ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ దేశ చరిత్రలో ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వేర్పాటువాదులు స్వర్ణదేవాలయంలో దాక్కుని కాల్పులు జరుపుతున్న సమయంలో వారిని మట్టుబెట్టడానికి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ ను అమలు చేశారు. ఇది సిక్కులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. తర్వాత సిక్కు భద్రతా సిబ్బంది చేతిలోనే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ ను అమలు చేయడం ఇందిరాగాంధీ తప్పేనని అందుకే ఆమె మూల్యం చెల్లించుకున్నారని అనేశారు. అయితే ఆ నిర్ణయం తీసుకుంది ఆమె ఒక్కటే కాదని.. ఆర్మీ,ఇంటలిజెన్స్ సహా అన్ని సంబంధిత వర్గాలు కలిపి తీసుకున్నాయని చెప్పారు. అయితే చిదంబరం చెప్పిన విధంగా ఆ నిర్ణయం తప్పన్నదే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తోంది.
అమెరికా చెప్పిందని పాక్ పై దాడి చేయలేదని ఇటీవల వ్యాఖ్యలు
ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ పై భారత్ దాడులు చేయాలనుకుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి..పాక్ పై దాడులు చేయవద్దని ఒత్తిడి చేస్తే.. తాము ఆగిపోయామని చిదంబరం చెప్పారు. ఈ స్టేట్ మెంట్ కాంగ్రెస్ పార్టీని ఇక్కట్లకు గురి చేసింది. అమెరికాకు లొంగిపోయింది కాంగ్రెస్ అయితే..ఇప్పుడు మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది. ఆ అవకాశాన్ని చిదంబరమే ఇచ్చారు. ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది.
చిదంబరం ఎందుకిలా ?
చిదంబరం ఎందుకిలా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో ఆయన జాతీయ పార్టీలో పెద్దగా కీలకంగా కూడా ఉండటం లేదు. కానీ ఆయన కుమారుడు ఎంపీగా ఉన్నారు. శశిథరూర్ లా ఏమైనా తేడాలు వచ్చాయా.. ఆయన ఏదైనా పొలిటికల్ ప్లాన్లో ఉన్నారా అన్నది స్పష్టత లేదు. కానీ చిదంబరం మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తున్నారు.