కాశ్మీర్ లో గత 6 వారాలుగా నిరవధికంగా సాగుతున్న అల్లర్లని అదుపు చేయడంలో భాజపా-పిడిపి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అందుకు అదే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పూర్తి బాధ్యత వహించాలని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. అల్లర్లు మొదలైన చాల కాలం వరకు మౌనం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ, నోరు విప్పి మాట్లాడినప్పుడు ఆ రెండు ముక్కలు కూడా సరిగ్గా మాట్లాడకపోవడం చేత పరిస్థితి ఇంకా విషమించిందని చిదంబరం అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం చేపడుతున్న చర్యలు పరిస్థితిని ఇంకా జటిలం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు ఎవరు ఎన్ని సానుభూతి మాటలు మాట్లాడినా పోయిన ప్రాణాలు తిరిగి రావని కనీసం ఇప్పడైనా కేంద్రప్రభుత్వం సరిగ్గా వ్యవహరించి అల్లర్లని నియంత్రించాలని చిదంబరం సూచించారు. పిడిపి కూడా అంగీకరించినట్లయితే ఈ సమస్యని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పరిష్కరించగలవని చిదంబరం అన్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి-భాజపాల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కనుకనే కేంద్రప్రభుత్వం కాశ్మీర్ అల్లర్ల వ్యవహారంలో తలదూర్చకుండా దూరంగా ఉండిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కాశ్మీర్ లో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి వేగంగా క్షీణిస్తుండటంతో వాటిని అదుపుచేయడం తన వల్ల కాదని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ గ్రహించిన తరువాతే సహాయం కోసం డిల్లీకి పరుగెత్తుకువచ్చారు. పరిస్థితులు అంతవరకు వచ్చేదాకా కేంద్రం సహకారం కోరకపోవడం ఆమె తప్పయితే, పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నప్పటికీ ఆమె జోక్యం చేసుకోమని కోరేవరకు ఉపేక్షించడం కేంద్రప్రభుత్వం తప్పని చెప్పక తప్పదు. సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో అటువంటి అసమర్ధ ముఖ్యమంత్రిని కొనసాగించడమే పెద్ద తప్పు. కానీ ఆ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసమే ఆమెని కేంద్రప్రభుత్వం ఉపేక్షిస్తోందని చెప్పకతప్పదు.
కాశ్మీర్ ప్రజలు కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాల ప్రజలలాగే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు అనుభవించే హక్కు కలిగి ఉన్నారని, పెన్నులు, క్రికెట్ బ్యాటులు పట్టాల్సిన కాశ్మీరీ యువత రాళ్ళు పట్టుకోవడం సరికాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ చిదంబరం చేసిన విమర్శలు బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలని ఉద్దేశ్యించి అన్నవే అయ్యుండాలి. ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించి దానిలో కాంగ్రెస్ పార్టీకి తెలియజేసి దాని అంగీకారంతోనే బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సంగతి చిదంబరంకి కూడా తెలుసు. కనుక దానిని తప్పు పట్టడం సరికాదు.