కేసీఆర్, చంద్రబాబుల పాలన బేరీజు వేసుకొంటే…

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు ప్రజలు ఇచ్చిన 60 నెలల గడువులో అప్పుడే 15 నెలలు పూర్తయిపోయింది. ఈ 15నెలల్లో వారేమి సాధించారు? వారిద్దరిలో ఎవరు ముందున్నారు? అని బేరీజు వేసుకొని చూసినట్లయితే చాలా విషయాలలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే మెరుగయిన పాలన అందిస్తూ తన రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు నేటికీ కూడా పోటాపోటీలుగా పెద్దపెద్ద హామీలను గుప్పిస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఏవో మిషన్లు, గ్రిడ్లు, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ కబుర్లు చెపుతూ రోజులు దొర్లించేస్తుంటే, కేసీఆర్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు, స్కైవేలు, హైవేలు అంటూ ప్రజలకి రంగుల కలలు చూపిస్తున్నారు. వారిద్దరూ కూడా తమ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని ప్రభుత్వాలకి ప్రాకింపజేసి ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో అనవసర రాజకీయాలతో విలువయిన సమయాన్ని, ప్రజాధనాన్ని కూడా చాలా వృధా చేస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత అన్నివిధాల చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడు, మంచి పరిపాలన దక్షుడు అయిన చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే ఆయన ఇంతవరకు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దలేకపోతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెపుతూనే పుష్కరాలు, విదేశీ యాత్రలు, ఆర్భాటంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఆయన ఇప్పుడు పరిపాలనకు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెదేపాకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయన్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. అందుకే కేసీర్ ఆంధ్రాలో ‘మీడియా మేనేజ్ మెంట్’ తప్ప అభివృద్ధి జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక దుస్థితి, రాజధాని లేకపోవడం, ఆ కారణంగా హైదరాబాద్ నుండి పరిపాలన కొనసాగించవలసి రావడం, తెరాస ప్రభుత్వంతో యుద్దాలు వంటి అనేక ప్రతిబంధకాలు ఆయనని నిలువరిస్తున్నట్లున్నాయి. కానీ ఇదివరకులాగ ఆయన పరిపాలనపై, ప్రభుత్వ వ్యవస్థలపై నేటికీ పట్టు సాధించలేకపోవడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మంత్రులు కూడా అన్నీ ఆయనే చూసుకోవాలి…చూసుకొంటారు..అన్నట్లు వ్యవహరిస్తూ ఎంతసేపు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను విమర్శించడానికే పరిమితమవుతున్నారు తప్ప తమతమ మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అంతా తానై వ్యవహరించడం చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.

తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సారవంతమయిన నేలలున్నాయి. ఒక్క రాయలసీమ తప్ప చాలా చోట్ల వాటికి నీటి వసతి కూడా ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎంతసేపు పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడటమే తప్ప రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి చేస్తున్నదేమీ కనబడటం లేదు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే అత్యంత సారవంతమయిన భూములపై రాజధాని నిర్మిస్తున్నారు. పోలవరానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దానిని పూర్తి చేసేందుకు ఆయన గట్టిగా కృషి చేసుంటే రాజధాని కోసం ఆయన ప్రభుత్వం సేకరించిన సారవంతమయిన భూములకు ప్రత్యామ్నాయంగా వేలాది ఎకరాలు భూమి సాగులోకి వచ్చి ఉండేది. కానీ ఆ పనిచేయకుండా పట్టిసీమతో కాలక్షేపం చేస్తున్నారు. బహుళార్ధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును ఐదేళ్ళలోనే నిర్మించి చూపుతామని మొదట గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానికి మరో రెండు మూడేళ్ళు అదనంగా జోడించి చెపుతున్నారు. అంటే తన హయంలో పోలవరం నిర్మాణం పూర్తికాబోదని ఆయనే స్వయంగా అంగీకరించస్తున్నట్లుంది.

రాష్ట్రంలో సారవంతమయిన భూములు, వాటికి చక్కటి నీటి వసతి అన్నీ ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని మరింత అభివృద్ధి చేసుకొనేందుకు ప్రయత్నించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే, నిస్సారమయిన భూములకు నీళ్ళ సౌకర్యం కల్పించి కొత్తగా లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. చెరువుల పునరుద్దరణ చేసి ఆయకట్టు స్థిరీకరణకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే గ్రామజ్యోతి పధకం ద్వారా ఇంతకాలంగా నిరాదరణకు గురయిన వేలాది గ్రామాలను మౌలిక వసతులు కల్పించి వాటినీ పట్టణాలతో, నగరాలతో సమానంగా పోటీ పడే విధంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఆధునిక పరిజ్ఞాన వినియోగం, పరిశ్రమలు, నగరాలు, పట్టణాలపైనే దృష్టి కేంద్రీకరిస్తే, కేసీఆర్ గ్రామాలు, వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇద్దరూ తమతమ అభిరుచి, ఆలోచనా విధానాల మేరకు తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఇద్దరినీ పోల్చి చూసినట్లయితే కేసీఆర్ నిర్దిష్టమయిన ప్రణాళికలతో, స్థిరంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎవరు తమ రాష్ట్రాలను ఏమేరకు అభివృద్ధి చేసారు? ఇచ్చిన హామీల్లో ఎన్నిటిని నిలబెట్టుకొన్నారు? అనే సంగతి మరో నాలుగేళ్ల తరువాత తేలుతుంది.

చంద్రబాబు నాయుడు అధికారం చేప్పట్టిన కొత్తలో తనతో అభివృద్ధిలో పోటీపడమని కేసీఆర్ కి తరచూ సవాలు విసురుతుండేవారు. కానీ ఇప్పుడు విసరడం లేదు…ఎందుకో? కేసీఆర్ ఆవిధంగా ఎన్నడూ సవాలు విసరనప్పటికీ తను చేయగలిగిందేదో నిశబ్దంగా చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆయన వచ్చే మూడేళ్ళలో ఇంటింటికీ నీళ్ళు, నిరంతర విద్యుత్ అందించలేకపోతే ప్రజలను ఓట్లు అడగబోమని చాలా దైర్యంగా చెపుతున్నారు. బహుశః మున్ముందు ఆయనే తిరిగి చంద్రబాబుకి సవాలు విసిరినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ తెదేపా, తెరాస పార్టీలకి ప్రజలు ఇచ్చిన గడువులో అప్పుడే 15నెలలు గడిచిపోయాయి. మిగిలిన 45 నెలల సమయంలో ఎవరు అభివృద్ధి చేసి చూపిస్తే మళ్ళీ వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు లేకుంటే నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టి వేరొకరికి ఆ అవకాశం కల్పించడం తధ్యం. ఏమీ చేయకుండా మళ్ళీ హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావలనుకొంటే మాత్రం సాధ్యం కాకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close