ఉరీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ కళకారులను భారత్ లో బహిష్కరించాలని అనధికారిక నిర్ణయం తీసుకుంటే… ఉగ్రవాదం విషయంలో పాక్ కు వంతపాడుతూ, పాకిస్థాన్ కు ఉగ్రవాదానికి పూర్తి సంబందాలు లేవనేలా సన్నాయి నొక్కులు నొక్కుతున్న చైనా విషయంలో భారతీయులు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాకు ఆసియాలో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులొస్తున్నాయి. అలాగే కొందమంది ప్రజలు స్వచ్చందంగా చైనా వస్తువులను బహిస్కరిస్తున్నారు.
ఈ క్రమంలో అనధికారికంగా భారత్ లో చైనా వస్తువులను నిషేదించాలనే డిమాండ్స్ రావడం, ఇప్పటికే చాలా మంది పెద్దలు కూడా ఈ విషయాలపై స్టేట్ మెంట్స్ ఇవ్వడం, వాటిని ప్రభుత్వం ఖండించకపోవడంతో… పొరుగుదేశం చైనా భారత్‌ను తీవ్రంగా హెచ్చరించింది. భారత్ లో తన వస్తువుల అమ్మకాన్ని బహిష్కరిస్తే అది ఇరుదేశాల సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని… అలాగే ఇరుదేశాల పరస్పర పెట్టుబడులను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ విషయాలపై స్పందించిన న్యూఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్… భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్న చైనీస్ కంపెనీలపై వస్తు బహిష్కరణ ప్రభావం పడుతుందని.. ఇరుదేశాల సంబంధాలపైనా ఈ అనధికారిక నిర్ణయం ప్రభావం చూపిస్తుందని.. దానిని ఇరుదేశాల ప్రజలూ కోరుకోవడం లేదని అన్నారు.
అయితే, చైనా దాయాది పాకిస్థాన్ కు కొమ్ముకాస్తుండటం, అంతర్జాతీయ వేదికలపై భారత్ కు అడుగడుగున మోకాలడ్డుతుండటంతో దేశంలో చైనా వస్తువులపై వ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రభుత్వం చైనా వస్తువులపై ఎలాంటి నిషేధం విధించకపోయినా, ఎటువంటి ప్రకటనా చేయకపోయినా స్వచ్ఛందంగా చైనా వస్తువుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ ప్రభావం దీపావళి సందర్భంగా చైనా టపాసులపై భారీగానే చూపుతోంది. దీంతో ఉలిక్కిపడిన చైనా, భారత్ ను హెచ్చరిస్తుంది. కాగా దక్షిణాసియాలో చైనాకు భారతే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంతేకాకుండా చైనా అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది.