ప్రజల కష్టాల గురించి పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ, వెక్కిరించినట్టు మాట్లాడితే సామాన్యులకు కోపం రాకుండా ఉంటుందా చెప్పండీ! రోజుల తరబడి బ్యాంకుల ముందూ ఏటీఎమ్ సెంటర్ల ముందూ లైన్లు కట్టి నిలబడటం అనేది సామాన్యులకు నిత్యకృత్యమైపోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంత బయటకి వచ్చిందో తెలీదుగానీ, సగటు భారతీయుడు మాత్రం ఇంకా బ్యాంకు బయటే ఉంటున్నాడు! ఈ కరెన్సీ కష్టాలు ఎన్నాళ్లకు తీరుతాయో ఎవ్వరికీ తెలీదు. అయితే, ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు.
పాతనోట్ల రద్దు తరువాత ప్రజలు లేనిపోని అపోహలకు గురౌతున్నారని, దానికి కారణం మీడియా అని మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అంతేకాదు, బ్యాంకుల ముందు క్యూలు కట్టి నిలబడ్డ ప్రజల గురించి కూడా కాస్త నిష్టూరంగానే మాట్లాడారు. చిరంజీవి సినిమా విడుదల అంటే టిక్కెట్ల కోసం గంటల తరబడి థియేటర్ల ముందు లైన్లలో నిలబడే ప్రజలు, డబ్బు కోసం బ్యాంకుల ముందు ఆమాత్రం నిలబడలేరా అని వ్యాఖ్యానించారు. కొన్ని గంటలపాటు బ్యాంకు ముందు వేచి చూడలేరా అంటూ ఎదురుదాడి చేసేలా వ్యాఖ్యానించడం కాస్త విడ్డూరంగా ఉంది.
అయితే, సినిమా టిక్కెట్లకీ బ్యాంకులో కరెన్సీ నోట్లకూ వేచి ఉండటంలో తేడా మంత్రిగారికి తెలీదేమో! సినిమా అనేది ఏ పండుగకో పున్నానికో వస్తుంది. కానీ, బ్యాంకుల ముందు బారులు తీరున్న జనం సినిమా చూడ్డానికి వచ్చినట్టు ఉత్సాహంగా రావడం లేదు. ఉసూరుమంటూ వస్తున్నారు. అయినా, సదరు మంత్రి వర్యులు ఒకరోజు బ్యాంకు ముందు క్యూలో నిలబడితే సామాన్యులు అవస్థలేంటో తెలిసేవి. కష్టార్జితం బ్యాంకుల్లో ఉన్నా ఖర్చుచేసుకోలేని దుస్థితి… ఏసీల్లో ఉంటున్నవారికి ఇది ఎలా అర్థమౌతుంది..? జీతం పైసలు వచ్చినా ఇంటి అద్దె కట్టలేక, పాలవాడికి బిల్ ఇవ్వలేక, నెలకి సరిపడా సరుకులు కొనుక్కోలేకా… ఇలాంటి అవస్థలు వారికి ఎలా అర్థమౌతాయి?