విలన్ పాత్రల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన జగపతిబాబు కెరీర్ మహా స్పీడుగా సాగిపోతోంది. స్టైలీష్ విలన్ పాత్రలకు జగ్గూభాయ్ కేరాఫ్ అడ్రస్ గా మారాడు. తెలుగులోనే కాదు, తమిళ మలయాళ భాషల్లోనూ జగ్గూభాయ్ విలన్ గా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో వాళ్లకు ధీటుగా నిలిచే విలన్ పాత్రల్లో జగపతిబాబు బాగా రాణిస్తున్నాడు కూడా. పారితోషికం కూడా ఊహించని స్థాయిలో గిట్టుబాటు అవుతోంది. పెద్ద పెద్ద సినిమాల్లో, క్రేజీ ప్రాజెక్టుల్లో జగపతిబాబు పేరు వినిపిస్తోంది. చిరంజీవి ఖైదీ నెం.150లోనూ ముందుగా జగపతిబాబు పేరే అనుకొన్నారు. అయితే.. చివరి క్షణాల్లో ఆ పాత్ర బాలీవుడ్ నటుడికి దక్కింది.
జగపతిబాబుని తీసుకోవాలని వినాయక్ కాస్త పట్టుబట్టినా చిరంజీవి మాత్రం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. వినాయక్ – జగపతిల మధ్య ఈ కథకు. విలన్ పాత్రకు సంబంధించిన చర్చలు కూడా నడిచాయి. ఈ సినిమాలో నటించడానికి జగ్గూభాయ్ కూడా ఆసక్తి చూపించాడు. చిరు 150 సినిమాలో జగ్గూభాయ్ ఎంట్రీ దాదాపుగా ఖాయమనుకొంటున్న తరుణంలో చిరు అడ్డుపుల్ల వేశాడని, దాంతో వినాయక్ కూడా ఏమీ చేయలేకపోయాడని టాక్. ఈ విషయమై జగపతిబాబుని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ”ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు?” అంటూ సమాధానం దాటేశాడు. కేవలం పారితోషికం భారీగా డిమాండ్ చేయడం వల్లే.. జగపతిబాబుని చిరు పక్కన పెట్టాడన్న టాక్ వినిపిస్తోంది.