రీ ఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవికి విజయాలు – పరాజయాలు రెండూ సమానంగా దొరికాయి. వాల్తేరు వీరయ్య తరవాత వచ్చిన భోళా శంకర్ బాగా నిరాశ పరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన `ఆచార్య` పరిస్థితి కూడా ఇంతే. ఈ యేడాది చిరుని వెండి తెరపై చూడాలేకపోయారు అభిమానులు. ‘విశ్వంభర’ సినిమా 2025లోనే రావాల్సింది. కానీ 2026కి వెళ్లిపోయింది.
అయితే 2026లో చిరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఆయన్నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` వస్తుంది. వేసవిలో ‘విశ్వంభర’ని విడుదల చేస్తారు. ఇవి రెండూ కాకుండా మూడో సినిమా కూడా ఉంటుంది. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వాల్తేరు వీరయ్య’తో హిట్టు కొట్టిన జోడీ ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ సినిమాని 2026 చివర్లో విడుదల చేయాలన్నది ప్లాన్. అదే జరిగితే… 2026లో చిరు హ్యాట్రిక్ కొట్టేసినట్టే. ఓ అగ్ర హీరో నుంచి ఒకే యేడాది మూడు సినిమాలు రావడం.. అరుదైన సంగతే. ఈ ఫీట్ ని చిరు సాధించినట్టు అవుతుంది. నిజానికి బాబీ సినిమా 2027 సంక్రాంతికి బరిలో దించుదాం అనుకొన్నారు. కానీ సంక్రాంతి సీజన్ కంటే ముందే సినిమా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే 2026 దసరా, లేదంటే దీపావళి సీజన్లో విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ యేడాది చిరు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదన్న లోటుని.. వచ్చే యేడాది వడ్డీతో సహా తీర్చబోతున్నారు చిరు.
మరోవైపు ‘స్పిరిట్’లో చిరు నటిస్తున్నారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై సందీప్ రెడ్డి వంగా ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఓ సినిమా చేస్తారు. 2026లోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది.