ఈతరం కథానాయికల్లో మేటి డాన్సర్ ఎవరు? అని అడిగితే కచ్చితంగా సాయి పల్లవి పేరే చెబుతారు. తన ఈజ్ అలాంటిది. తన గ్రేస్ అలాంటిది. సాయి పల్లవి డాన్సులకు సాక్ష్యాత్తూ… చిరంజీవినే ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని చిరు స్వయంగా చెప్పాడు. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సాయి పల్లవి డాన్సుల గురించి ముచ్చటిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
”సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమా ఆచార్యలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు చిరు. చైతూ కథల ఎంపిక బాగుందటుందని, తనకు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని చిరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాని ‘సారంగ దరియా’ పాట కోసమైనా మూడు సార్లు చూస్తానని చిరు చెప్పడం కొస మెరుపు.