కాంబినేషన్ కంటే కథ ముఖ్యం. ఈ విషయాన్ని చిత్రసీమ ఎప్పుడు గమనిస్తుందో.. అప్పుడు విజయాలు వరుస కడతాయి. అందుకే అగ్ర హీరోలు ఇప్పుడు కథ విషయంలో రాజీ పడడం లేదు. దర్శకుడు తెచ్చిన కథని అన్ని రకాలుగా మధించి, అప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ఈలోగా మార్పులు, చేర్పులు సహజాతి సహజం. కొన్నికొన్నిసార్లు ఏకంగా కథలే మారిపోతుంటాయి. ఇప్పుడు ఇద్దరు అగ్ర హీరోలకు సంబంధించిన కథలు కూడా ఇలానే మారిపోయాయని ఇన్ సైడ్ వర్గాల టాక్.
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. నయనతారని కథానాయికగా ఎంచుకొన్నారు. ఈపాటికే షూటింగ్ మొదలవ్వాలి. అయితే.. ఇంకొంత సమయం పట్టబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కథ విషయంలో ఇప్పటికీ తర్జనభర్జనలు జరుగుతున్నాయట. గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ చారిత్రక నేపథ్యం ఉన్న కథని రాసుకొన్నారు. అది బాలయ్యకూ బాగా నచ్చింది. అయితే.. బడ్జెట్ మాత్రం చాలా కావాలి. బాలయ్య మార్కెట్ ని దాటి ఖర్చు పెట్టాలి. నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కథలో కొన్ని కొన్ని మార్పులతో బడ్జెట్ ని అదుపులో పెట్టొచ్చు అనిపించిందని భావించార్ట. దాంతో కథని రీ రైట్ చేసుకొంటూ వెళ్లారు. ఇప్పుడు కథ స్వరూపమే మారిపోయిందని టాక్. ఈసారి కథ ఇంకాస్త బాగా తయారైందని తెలుస్తోంది. రీ రైట్ లో ఉండే సౌలభ్యమే అది. కథని స్క్రిప్టు దశలోనే చెక్కుకొంటూపోతే మంచి ఫలితమే వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని తెలుస్తోంది.
చిరంజీవి – బాబీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తరవాత పట్టాలెక్కబోయే చిరు సినిమా ఇదే. స్క్రిప్టు పూర్తయ్యింది. అయితే ముందు అనుకొన్న కథ వేరు. ఈ కథ వేరని తెలుస్తోంది. ముందు అనుకొన్న కథ కూడా బాగున్నప్పటికీ, ఆ ఛాయల్లో ఇటీవలే ఓ సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టిందని, అందుకే కథని మార్చాల్సివచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు అగ్ర హీరోలు కథ విషయంలో ఒకేలా ఆలోచించారు. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో?