ఈరోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం మహా కష్టమైపోతోంది. సినిమా చూసి తప్ప ఏ ఓటీటీ సంస్థ కొనడం లేదు. రిలీజ్కు ముందు వరకూ… ఓటీటీ బేరాలు కొనసాగుతూనే ఉంటాయి. అలాంటిది చిరంజీవి సినిమా మాత్రం హాట్ కేక్ లా మారిపోయింది. చిరు – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈలోగానే ఓటీటీ బేరం ఆల్మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసింది. అమేజాన్ రూ.55 కోట్ల వరకూ వచ్చింది. అటూ ఇటుగా రూ.60 కోట్లకు డీల్ సెట్టయ్యే అవకాశం ఉంది. టీజర్ కూడా బయటకు రాకుండా ఓటీటీ అమ్మకం జరిగిపోవడం నిజంగా గ్రేటే. కాంబినేషన్ పై నమ్మకంతో ఓటీటీ రేటుకు రెక్కలొచ్చాయి.
ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తారు. టైటిల్ కూడా దాదాపుగా ఫిక్సయ్యింది. మంచి ముహూర్తం చూసుకొని టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారు. టైటిల్ లో ‘సంక్రాంతి’ సౌండింగ్ వినిపించే అవకాశం ఉంది. పండగ సినిమా, పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ కూడా వుంది. అందుకే అలాంటి టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజుల కాల్షీట్లు అవసరం. ఓ పాటలో కూడా వెంకీ కనిపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రమణ గోగులతో ఇటీవల ఓ పాట పాడించారు. చిరు కూడా ఓ పాట పాడే అవకాశాలు ఉన్నాయి.