నటుడిగా మోహన్ బాబు 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకొన్నారు. ఏ నటుడికైనా ఇదో గొప్ప మైలు రాయి. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఈ కాలంలో… 50 ఏళ్ల పాటు నిలదొక్కుకొన్నారంటే మామూలు విషయం కాదు. పైగా మోహన్‌బాబుది డక్కాముక్కీలతో సాగిన జర్నీ. నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వివాదాలు ఎదుర్కొన్నారు. అయినా నిలబడ్డారు. అందుకే ఈ మైలు రాయి చాలా ప్రత్యేకం.
ఈ సందర్భంగా మోహన్ బాబు వరుసగా పార్టీలు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న పాత్రికేయులకు, ‘మా’ సభ్యులకు ప్రత్యేక విందు ఇచ్చారు. శనివారం హైదరాబాద్ లో సినీ సెలబ్రెటీలకు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందుకు మోహన్ బాబుతో ప్రత్యేక అనుబంధం ఉన్న నటీనటులు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. రజనీకాంత్, వెంకయ్య నాయుడు, బ్రహ్మానందం తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే.. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ మిస్సయ్యారు. ఈ నలుగురికీ ఆహ్వానాలు కూడా అందాయి. అయితే చిరు షూటింగ్ లో, నాగ్ బిగ్ బాస్ హౌస్ లో బిజీగా ఉండడం వల్ల రాలేదు. బాలకృష్ణ అఖండ 2 ప్రమోషన్ల హడావుడిలో ఉన్నారు.
నిజానికి 50 ఏళ్ల వేడుకను ఓ భారీ ఈవెంట్ లా నిర్వహిద్దామనుకొన్నారు. కానీ చివరి క్షణంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సివచ్చింది. మోహన్ బాబు జీవిత కథపై ఓ పుస్తకాన్ని కూడా తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నారు. జర్నలిస్టు ప్రభు మోహన్ బాబు జీవిత చరిత్ర రాస్తున్నారు. ఆ పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేసుంటే బాగుండేది.