‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లోకి వచ్చి వెళ్లిపోయింది. ఓటీటీలోనూ ఈ సినిమా చూసేశారు. ఇటీవలే 50 రోజుల పండగ కూడా జరుపుకొన్నారు. అయితే చిరు తదుపరి సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సంక్రాంతి తరవాత బాబీ సినిమా మొదలవుతుందన్నారు. కానీ చిరుకి చిన్న పాటి సర్జరీ అవ్వడంతో అది లేట్ అయ్యింది. మార్చిలో షూటింగ్ అన్నారు. కానీ ఈమధ్య కూడా చిరు మరో సర్జరీ చేయించుకోవాల్సి రావడంతో ఈనెలలోనూ ఈ సినిమా మొదలవ్వడం లేదు. మరోవైపు బాబీ స్క్రిప్టు రెడీ చేసేశారు. ఫైనల్ నేరేషన్ కూడా అయిపోయింది. మరి షూటింగ్ ఎప్పుడు? అనేదే ప్రశ్న.
ఇప్పుడు ఆ ముహూర్తం కూడా సెట్ అయిపోయిందని టాక్. ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఓ పాత్ర కోసం మోహన్ లాల్ పేరు పరిశీలిస్తున్నారు. ఆయనతో కూడా సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రియమణి కీలక పాత్ర పోషించనుంది. దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు. ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిళ్లు రిజిస్టర్ చేయించారు. వీటిలో ఒకటి ఖరారు చేస్తారా? లేదంటే కొత్త టైటిల్ ఏమైనా బయటకు వస్తుందా? అనేది చూడాలి.
